బట్టతలపై జుట్టు మొలిపిస్తానని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యురాలు, ఇద్దరు ఇంజినీర్లు మృతి

ఐవీఆర్

మంగళవారం, 27 మే 2025 (12:05 IST)
బట్టతల వున్న పురుషుల్లో చాలామంది అది అతిపెద్ద నామోషీగా ఫీలవుతుంటారు. అందుకని ఎలాగైనా బట్టతలపై జుట్టును మొలిపించుకునేందుకు తంటాలు పడుతుంటారు. ఇందుకోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడదే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తామంటూ వస్తున్న నకిలీ వైద్యులకు పెద్ద ఆదాయ వనరుగా మారుతోంది. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం తరువాయి సంగతి కానీ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వినీత్ కుమార్ దూబె, ప్రమోద్ కతియార్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వాళ్లిద్దరూ బట్టతల కారణంగా ఆత్మన్యూనతకు లోనవుతుండేవారు. దీనితో సమీపంలో వున్న హెయిర్‌ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ డెంటిస్ట్ డాక్టర్ అనుష్క తివారీ వాళ్లిద్దరి బట్టతలలపై ఒత్తుగా జుట్టు మొలిపిస్తానని చెప్పింది. ఆ వైద్యురాలి మాటలు నమ్మిన ఇంజినీర్లు చికిత్స చేయించుకున్నారు. గత మార్చి 14న వినీత్ కుమార్ దూబె ట్రీట్మెంట్ చేయించుకున్నాడు.
 
ఇంటికి వచ్చాక అతడి ముఖం అంతా వాచిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన అతడి భార్య జయా త్రిపాఠి వెంటనే వైద్యురాలు అనుష్క తివారీకి ఫోన్ చేసింది. ఐతే అనుష్క అందుబాటులోకి రాలేదు. దీనితో భర్తను వేరే ఆసుపత్రికి తరలించింది. ఐతే అప్పటికే అతడికి వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయాడు. తన భర్త చావుకి కారణం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స చేసిన డాక్టర్ అనుష్క అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు విషయాన్ని చాలా లైట్ తీసుకున్నారు.
 
తనకు పోలీసు స్టేషనులో న్యాయం జరగడం లేదంటూ ఆమె ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతిని సమర్పించింది. దాంతో మే 7వ తేదీన కేసు నమోదు చేసారు. ఇది తెలిసిన డాక్టర్ అనుష్క ఆసుపత్రిని వదిలేసి పారిపోయింది. అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైద్యురాలు ఎట్టకేలకు మే 27వ తేదీ సోమవారం కోర్టు ముందు లొంగిపోయింది. ప్రాధమిక సమాచారాన్ని బట్టి అనుష్క తివారీకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలో ఎలాంటి అనుభవం లేదని తేలింది. ఆమెను రిమాండుకు తరలించి తదుపరి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు