అనంతపురంలో కలకలం రేపిన బాలికపై అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో బాధితురాలు తొలుత ఇచ్చిన వాంగ్మూలం కారణంగా కానిస్టేబుల్ అన్యాయంగా జైలుపాలయ్యాడు. అదే బాలిక ఇపుడు జడ్జి సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్‌తో వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
జిల్లాలోని గుత్తి మండలానికి చెందిన రమేష్ అనే వ్యక్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన భార్య ప్రభుత్వ ఉద్యోగిని. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లలను చూసుకోవడం వారికి ఇబ్బందిగా మారింది. దీంతో పిల్లల బాగోగులను చూసుకునేందుకు వీలుగా అదే గ్రామానికి చెందిన ఓ బాలికను రెండేళ్ల క్రితం ఇంటికి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ఆ బాలిక.. తనకు అన్నం పెడుతున్న కానిస్టేబుల్‌పై పోలీసులకు ఒక ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ రమేష్ తనపై అత్యాచారం చేస్తున్నారని, ఓసారి గర్భస్రావం కూడా చేయించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలిని మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు.
అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్‌లో తనపై అత్యాచారం చేసిన వాలంటీర్ రాజశేఖర్ పేరును బయటపెట్టింది. కానిస్టేబుల్ ఇంటి పక్కనే ఉండే ఈ వాలంటీర్‌కు భార్యాపిల్లలు కూడా ఉన్నారు. రమేష్ దంపతులు ఇంట్లో లేని సమయంలో బాలికను ప్రేమిస్తున్నట్టు నమ్మించి అత్యాచారానికి పాల్పడగా, రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. దీనిపై కుటుంబ సభ్యులు నిలదీయడంతో కానిస్టేబుల్‌పై నింద మోపింది. అయితే మేజిస్ట్రేట్ వద్ద ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు వాలంటీర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అన్నంపెట్టినందుకు ఆ బాలిక చేసిన పనికి కానిస్టేబుల్ జైలు పాలయ్యాడు.