పిల్లలు పుట్టిస్తానంటూ మురుగు నీరు తాపించారు.... తాంత్రికుడి క్రూరత్వానికి నిండు ప్రాణం పోయింది...

ఠాగూర్

మంగళవారం, 8 జులై 2025 (15:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తాంత్రికుడి క్రూరత్వానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పదేళ్లుఘా పిల్లలు కలగలేదన్న ఆవేదనతో తాంత్రికుడుని ఆశ్రయించడమే ఆ మహిళ చేసిన తప్పు. ఆ తాంత్రికుడి అమానవీయ చర్యల వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దెయ్యం వదిలించే పేరుతో జరిపిన అమానవీయ చర్యల వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. అత్యంత దారుణమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
 
ఆజంగఢ్ జిల్లా కంధరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్ పూర్ గ్రామానికి చెందిన అనురాధ (35) అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆమెకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో, తన తల్లితో కలిసి స్థానికంగా పూజలు చేసే చందు అనే తాంత్రికుడిని ఆశ్రయించింది. సంతానం కలిగేలా చేస్తానని నమ్మబలికిన చందు.. అనురాధకు దెయ్యం పట్టిందని, దానిని వదిలించాలంటూ పూజలు మొదలుపెట్టాడు.
 
ఈ పూజల పేరుతో తాంత్రికుడు చందు, అతని సహచరులు అనురాధ జుట్టు పట్టుకుని లాగడం, గొంతు, నోరు గట్టిగా నొక్కడం వంటివి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా మురికి కాలువ, టాయిలెట్లోని నీటిని బలవంతంగా తాగించారని తెలిపారు. ఇది చూసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాధితురాలి తల్లిని వారు పట్టించుకోలేదు. కాసేపటికే అనురాధ ఆరోగ్యం విషమించడంతో తాంత్రికుడు, అతడి బృందం ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించడంతో నిందితులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.
 
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి బలిరామ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతానం కలిగేలా చేసేందుకు తాంత్రికుడు చందు తమతో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఇప్పటికే అడ్వాన్స్ రూ.22,000 తీసుకున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
ప్రధాన నిందితుడైన తాంత్రికుడు చందు పోలీసుల ఎదుట లొంగిపోగా, పరారీలో ఉన్న అతడి సహచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చందు తన ఇంట్లో చిన్న చిన్న గుడులు, గంటలు, విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు