చిన్నచిన్న విషయాలకే హత్యలు జరుగుతున్నాయి. ఓ మహిళ తన ఇంటి ముందు రోడ్డుపైన పొరుగింటివారు చెత్త, నీళ్లు పోస్తున్నందుకు ప్రశ్నించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంట్లోని యువకుడు ఆమె తల నరికేసిన భయానక ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జార్ఖండ్ లోని దంకా జిల్లా కేవత్పర పరిధిలోని కబ్రిస్తాన్ రోడ్ వీధిలో కొత్తగా పిసిసి రోడ్డు వేసారు. ఈ రోడ్డుపైన ఫల్చంద్ షాకి చెందిన కుటుంబం చెత్తాచెదారం వేస్తూ గలీజ్ చేసేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన పొరుగుంటి వ్యక్తి మనోజ్ సింగ్ వారిని ప్రశ్నించాడు. ఇదికాస్తా చిలికిచిలికి గాలివానలా మారింది. మనోజ్ సింగ్ భార్య విమల బైటకు వచ్చి ఫల్చంద్ షాతో వాగ్వాదానికి దిగింది. పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం తెలియదా అంటూ గట్టిగా నిలదీసింది.
దీనితో ఆగ్రహావేశానికి లోనైన ఫల్చంద్ ఇంట్లోకి వెళ్లి పెద్ద కత్తిని తీసుకుని వచ్చాడు. చెత్త గురించి ప్రశ్నిస్తున్న విమల తలను నరికేశాడు. అతడు కత్తి ఎత్తినప్పుడు విమల భర్త చేతులను అడ్డుపెట్టి ఆపబోయాడు. కానీ అతడి చేతులు, శరీరానికి కూడా తీవ్ర గాయాలవుతూ కత్తి ఆమె మెడపై పడింది. విమల అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం హంతకుడు నేరుగా వెళ్లి పోలీసు స్టేషనులో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.