యూపీ సీఎం రేసులో ఆ నలుగురు.. సీఎం కుర్చీ వద్దన్న రాజ్‌నాథ్ సింగ్.. ఎందుకో తెలుసా?

ఆదివారం, 12 మార్చి 2017 (17:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో బీజేపీకి చెందిన నలుగురు అగ్రనేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒకరు. అయితే, ఈయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖంగా లేరు. 
 
ఆయన కేంద్ర హోం మంత్రిగానే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పైగా, సీఎంగా బాధ్యతలు చేపడితే ప్రతి పనికీ ప్రధాని మోడీ వద్దకు కూడా రావాల్సి వస్తుంది. దీన్ని ఆయన ఇష్టపడటం లేదు. రాజ్‌నాథ్ సింగ్ యూపీలోని ఘజియాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
అలాగే, మిగిలిన నేతల్లో యూపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, కేంద్ర టెలికం శాఖా మంత్రి మనోజ్ సిన్హాల పేర్లు ఉన్నాయి. వీరిలో మనోజ్ సిన్హా ముందున్నారు. 
 
గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు యూపీనే కీలకం. అప్పుడు ఈ రాష్ట్రంలో 73 లోక్‌సభ స్థానాల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీ మరోసారి కేంద్రంలో పీఠాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ యూపీలోనూ గణనీయమైన సీట్లను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరైనా ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేసేవిధంగా ఉండాలని ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్‌ షా ఆకాంక్షగా ఉంది. 
 
అయితే, ఈ నలుగురి పేర్లలో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తుందోనన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆదివారం రాత్రి సమావేశమై యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సీఎం అభ్యర్థులను ఖరారు చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి