పవన్ కళ్యాణ్‌ను ఓ కంట కనిపెట్టండి.. చెప్పిందెవరు..?

గురువారం, 9 మార్చి 2017 (12:51 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో కాదు రాజకీయాల్లో కూడా తనదైనశైలిలో ముందుకు వెళుతున్న వ్యక్తి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇంకా రాకున్నా పరోక్షంగానే తానేంటూ నిరూపిస్తున్నాడు. ఏపీలో ప్రజలు పడుతున్న సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వాటి పరిష్కారం వైపు కృషి చేస్తున్నారు. ఇలా ఒక్కటి కాదు ఎన్నో సమస్యలపై పవన్ స్పందించారు. మొదట్లో పవన్ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీకి తన సపోర్టు ఇవ్వడంతో ఆయన కూడా వారితో కలిసిపోయారని అందరూ భావించారు.
 
అయితే కొన్నిరోజులకు సీన్ రివర్స్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిరోజులకు తానేంటో చూపించాడు పవన్. సాదాసీదాగా పెట్టుకున్న జనసేనకు ఏకంగా రాజకీయాల్లో పోటీ చేసే అర్హతను సంపాదించుకున్నారు. అంతటితో ఆగలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. దీంతో తెలుగుదేశం, వైకాపా నాయకుల్లో భయం పట్టుకుంది. పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తే ఓట్లు చీలిపోవడం ఖాయమన్న అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు నేతలు. 
 
ప్రధానంగా అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకే ప్రస్తుతం పవన్ అంటే గుబులెక్కువ. కారణం.. ఇప్పటికే వైకాపా అధికారంలోకి వస్తుంది.. తాను సిఎం అవుతానని చెబుతున్నారు జగన్.. ఇది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి మరో రెండుసంవత్సరాల కాలం ఉండగానే ఇప్పటికైనా హడావిడి చేసేస్తున్నారు జగన్. ఈయన హడావిడి చూస్తున్న నేతలు కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్న ఆనందంలో ఉన్నారు.
 
కానీ రాజకీయ విశ్లేషకుల ఆలోచన ప్రకారం పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తే జగన్ సీఎం అవ్వడం సాధ్యం కాదంటున్నారు. గత ఎన్నికల్లోలాగా పవన్ కళ్యాణ్‌ ఈ సారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుంటే జగన్‌కు ఛాన్సులు ఉన్నాయంటున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే సీరియస్‌గా తీసుకున్నారట. 
 
పవన్ ప్రతి కదలికల్ని కనిపెట్టమని కొంతమంది వ్యక్తులను కూడా సీక్రెట్‌గా నియమించేశారట. పవన్ రాజకీయాలపై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తనకు తెలియజేయాలని చెప్పారట. దీంతో వారు పవన్ కళ్యాణ్‌‌ను 24*7 చూస్తున్నారట. మొత్తం మీద పవన్‌పై జగన్ నిఘా ఏ మాత్రం ఎన్నికల్లో ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి