బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఒక ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఆయన బ్రిటన్‌లోని పలు కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నారనీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల అమేథీలో రాహుల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని కూడా ఆమోదించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెనుకంజ వేశారు. పిమ్మట 24 గంటల తర్వాత రాహుల్ నామినేషన్‌ను ఆమోదించారు.
ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఒక ఫిర్యాదు చేశారు. రాహుల్‌కి నాలుగు పాస్‌పోర్టులు ఉన్నాయనీ... అందులో ఒకటి రావుల్ విన్సీ పేరుతోనూ, ఆయన మతం క్రిస్టియన్‌గానూ ఉందంటూ ఇటీవల స్వామి దుమారం రేపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నోటీసు జారీచేసింది. '2003లో బ్రిటన్‌లో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారనీ... 51 సౌత్‌గేట్ స్ట్రీట్, వించెస్టర్, హ్యాంప్‌షైర్ ఎస్‌వో23 9ఈహెచ్ అడ్రస్‌తో ఉన్న సదరు కంపెనీకి మీరు ఓ డైరెక్టర్‌గానూ, సెక్రటరీగానూ ఉన్నట్టు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి నుంచి మాకు ఫిర్యాదు అందింది' అంటూ హోంశాఖలోని పౌరసత్వ వ్యవహారాల డైరెక్టర్ బీసీ జోషి తన లేఖలో పేర్కొన్నారు.
2005 అక్టోబర్ 10, 2006 అక్టోబర్ 31లో బ్యాకోప్స్ కంపెనీ దాఖలు చేసిన వార్షిక రిటర్నుల్లో రాహుల్ తన పుట్టిన తేదీ 1970 జూన్ 10 గానూ, తాను బ్రిటీష్ పౌరుడిగానూ వెల్లడించినట్టు స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. 2009 ఫిబ్రవరి 17 నాటి కంపెనీ డిసొల్యూషన్ దరఖాస్తులోనూ రాహుల్ బ్రిటీష్ పౌరుడుగానే ఉందని కేంద్రం తన నోటీసుల్లో పేర్కొంది. 'ఈ విషయంలో 15 రోజుల్లోగా వాస్తవాలను తెలియపర్చాల్సిందిగా కోరుతున్నాం' అంటూ ఆదేశించింది.
కాగా, ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు సరిగ్గా పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలోనే కేంద్రం ఆయనకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథితో పాటు కేరళలో వయనాడ్ నుంచి రాహుల్ పోటీచేస్తున్నారు.