కలియుగ దైవానికి కరోనా తాకిడి: తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఏంటి?

సోమవారం, 17 మే 2021 (16:10 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలకు లక్షలాది భక్తులు వస్తుంటారు. క్యూలైన్లలో పరిస్థితి ఎలా వుంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంత జనం.. ప్రతి ప్రాంతం గోవిందనామస్మరణే. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల ప్రస్తుతం భక్తులు లేక వెలవెలబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా కారణంగా తిరుమల గిరులు నిర్మానుష్యంగా మారిపోయాయి.
 
కలియుగ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గత సంవత్సరం వచ్చిన కరోనా కారణంగా తిరుమల ఆలయంలో సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తూ భక్తులను దర్సనానికి అనుమతించలేదు. సుమారు మూడునెలల పాటు నిలిపివేశారు. 
 
టిటిడి చరిత్రలో ఇన్నిరోజుల పాటు భక్తులకు స్వామివారిని దూరం చేయడం అదే ప్రథమం. అయితే మొదటి వేవ్ తగ్గింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నాము అనుకుంటున్న సమయంలో రెండవ వేవ్ ప్రారంభమైంది. మార్చి నెల ప్రారంభం నుంచి కరోనా కేసులు ఉదృతమయ్యాయి.
 
ఏప్రిల్ నెలలో క్రమేపీ కేసుల సంఖ్య పెరిగిపోయింది. మే నెలలో మరణాల రేటు ఊహించని స్థాయిలో పెరిగింది. తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో ఆందోళనకు గురై భక్తులు తిరుమల రావడం తగ్గించారు. ఈనెల ప్రారంభం నుంచి భక్తుల తాకిడి తిరుమలలో బాగా తగ్గిపోయింది.

కరోనాతో మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు
గత నెల 15వ తేదీ నుంచి శ్రీవారి దర్సనానికి సంబంధించిన టోకెన్లను కౌంటర్ల ద్వారా ఇవ్వడం మానేశారు. తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్లను ఇచ్చేవారు. కానీ కరోనా కేసులు విపరీతంగా వున్న మహారాష్ట్ర, కర్నాటక  నుంచి భక్తులు ఎక్కువగా తిరుపతికి వస్తుండటంతో టిటిడి వెంటనే అప్రమత్తమైంది.
 
కరోనా వ్యాప్తి చెందకూడదన్న ఉద్దేశంతో ఆఫ్‌లైన్‌లో టోకెన్లను నిలిపివేసింది. ప్రతిరోజు గతంలో ఆఫ్ లైన్ ద్వారా 15 వేల టోకెన్లను టిటిడి అందిస్తూ వస్తోంది. ఇక ఆన్‌లైన్ ద్వారా అయితే 25 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉండేవి. అయితే ఆ టోకెన్లను కూడా కుదించడం మొదలుపెట్టింది. 10 వేల టోకెన్లను ఆన్‌లైన్‌లో ఇవ్వకుండా నిలిపివేసింది. దీంతో కేవలం 15 వేల టోకెన్లు మాత్రమే భక్తులు ఆన్‌లైన్‌లో 300 రూపాయలు చెల్లించి పొందేవారు.
 
కానీ తిరుపతి, తిరుమలలో రెండు ప్రాంతాల్లోను కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వుండటంతో భక్తుల్లోను ఆందోళన మొదలైంది. గతనెల ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టోకెన్లను భక్తులందరూ బుక్ చేసుకున్నారు. కానీ టోకెన్లను బుక్ చేసుకున్న భక్తులెవరూ దర్సనానికి రావడం లేదు.

అప్పుడు లక్షల్లో... ఇప్పుడు వేలల్లోనే...
క్రమేపీ శ్రీవారిని దర్సించుకునే భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. మొదట్లో 10వేల మంది, ఆ తరువాత 8 వేలు, 6 వేలు, 4 వేలు, ప్రస్తుతం 3 వేలకు దగ్గరలో ఉంది. ఇంత తక్కువ స్థాయిలో గతంలో స్వామివారిని దర్సించుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవన్నది టిటిడి భావన. టిటిడి విడుదల చేసిన ప్రకటనను గమనిస్తే గత శనివారం స్వామివారిని 5,108 మంది భక్తులు దర్సించుకున్నారు. శుక్రవారం 14వ తేదీన 4,651 మంది భక్తులు, 13వ తేదీన 2,141 మంది, 12వ తేదీ అయితే 2,262 మంది, 11వ తేదీ 2,400 మంది ఇలా అతి తక్కువగా భక్తులు శ్రీవారిని దర్సించుకున్నారు.
 
శ్రీవారి హుండీ ఆదాయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు సుమారుగా 3 కోట్లకు చేరువలో హుండీ ఆదాయం ఉంటుంది. అలాంటిది ఈ నెల 10వ తేదీ నుంచి హుండీ ఆదాయాన్ని ఒకసారి చూస్తే 10వ తేదీ 57లక్షలు, 11వ తేదీ 24 లక్షలు, 12వ తేదీ 11లక్షలు, 13వ తేదీ 17 లక్షలు, 14వ తేదీ 10 లక్షల రూపాయల హుండీ ఆదాయం. ఇంత తక్కువలో హుండీ ఆదాయం రావడం ఇదే ప్రథమంగా టిటిడి భావిస్తోంది.


భక్తుల బారులు ఏవీ?
తలనీలాలు.. స్వామివారికి భక్తులందరూ ఎంతో భక్తిభావంతో తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు కాలినడకన నడుచుకుంటూ వచ్చి మొక్కుగా తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్సించుకుంటారు. అలాంటి తలనీలాలు ఇచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణకట్ట, మినీ కళ్యాణకట్టల వద్ద భక్తులు బారులు తీరి కనిపించేవారు. కానీ ప్రస్తుతం కళ్యాణకట్ట బోసిపోయి కనిపిస్తోంది.
 
తలనీలాలు సమర్పించిన భక్తులను చూస్తే ఈ నెల 10వ తేదీ 2,216 మంది, 11వ తేదీ 1,375, 12వ తేదీ 925 మంది, 13వ తేదీ 1,005 మంది, 14వ తేదీ 1,889 మంది భక్తులు ఉన్నారు. మినీ కళ్యాణకట్టలో వేలమంది ప్రతిరోజు తలనీలాలు సమర్పించుకునేవారు. అలాంటి ప్రధాన కళ్యాణకట్ట నుంచి తిరుమల గిరులలో టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టల వరకు అన్నీ ఖాళీగా దర్సనమిస్తున్నాయి.

షాపులు తెరవాలంటేనే భయం...
తిరుమలలో చిన్న వ్యాపారుల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. షాపులు తెరవాలంటేనే యజమానులు భయపడిపోతున్నారు. ఒకవైపు కరోనా వైరస్ సోకుతుందన్న భయం.. మరోవైపు భక్తులు లేకుండా ఖాళీగా షాపులో కూర్చోవాలన్న బాధ రెండింటింతోను షాపులను తెరవడమే మానేశారు. 
 
తిరుమలేశుని ప్రసాదం. తిరుమలకు వచ్చారంటే చాలు ప్రసాదం తీసుకొచ్చావా అంటూ మన స్నేహితులు, బంధువులు అడుగుతుంటారు. సాధారణంగా స్వామివారి లడ్డూ దొరకడం కష్టసాధ్యమే. చిన్న లడ్డూలు రెండుకు మించి ఇచ్చేవారు కాదు. ఇక పెద్ద లడ్డూ, వడ అయితే అస్సలు దొరకవు.

తిరుమల లడ్డూలు ఎన్ని కావాలి?
అలాంటిది ఇప్పుడు ఎంత కావాలంటే అంత ప్రసాదాలు దొరుకుతున్నాయి. భక్తులు ఎన్ని అడిగినా లడ్డూ, వడలను ఇచ్చేస్తున్నారు. చాలా సులువుగా ప్రసాదాలు దొరుకుతున్నాయి. ప్రసాదాలను ఇచ్చే కౌంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వచ్చిన భక్తుల్లో చాలామంది ఎంతో ఆనందంగా కావాల్సినంత ప్రసాదాలను తీసుకొని ఆనందంగా ఇళ్ళకు వెళుతున్నారు. 
 
ఇప్పట్లో కరోనా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు. సెకండ్ వేవ్ భయపెడుతుంటే ఇక థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం భక్తులను మరింతగా భయపెడుతోంది. దీంతో పాటు ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడంతో కూడా భక్తులు తిరుమల రావడానికి ఆసక్తి చూపడం లేదు. తిరుమలకు ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచే భక్తులు వస్తుంటారు.


కరోనా కేసులతో కర్ఫ్యూ
అలాంటి ఆ రాష్ట్రాల్లోను కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో తిరుమలకు ఆ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎవరో కొందరు మాత్రమే సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చి వెళుతున్నారు. అది కూడా టోకెన్ ఉంటేనే తిరుమలకు అనుమతిస్తున్నారు. 
 
టోకెన్ లేకుంటే వచ్చిన భక్తులను అలిపిరి నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. ఇక కాలిబాట భక్తుల పరిస్థితి కూడా అదే. నడిచి వెళ్ళే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. రెండు కాలిబాటలు తెరిచే ఉన్నాయి. అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు మార్గాలు రెండూ తెరిచే ఉన్నా భక్తులు మాత్రం నడిచి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో కాలిబాటలు కూడా నిర్మానుషంగా దర్సనమిస్తున్నాయి. 


తితిదే ఉద్యోగులకే కరోనా
ఇదిలా ఉంటే కరోనాతో ఈ మధ్య 15 మంది టిటిడి ఉద్యోగస్తులే చనిపోయారని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. ఇది కాస్త ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. స్వామివారి దగ్గర సేవ చేసే వారే కరోనాతో చనిపోతుంటే మన పరిస్థితి ఏంటంటూ భక్తులు ప్రశ్నించుకుంటూ తిరుమలకు రావడం మానేస్తున్నారు.
 
తిరుమల మాత్రమే కాదు స్థానిక ఆలయాల పరిస్థితి మొత్తం కూడా ఇదే. టిటిడి ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాసమంగాపురం, కపిలతీర్థం, కోదండరామాలయం ఇలా అన్ని ఆలయాలు ఖాళీగా ఉన్నాయి. ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి, సత్యప్రమాణాలకు నెలవైన కాణిపాక వరిసిద్ధి వినాయక ఆలయాలు కూడా బోసిపోయే కనిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు