జగన్ దీక్ష సాగేనా... ? పోలీసుల మౌనం వెనుక ఆంతర్యం ఏంటి..?

సోమవారం, 5 అక్టోబరు 2015 (10:03 IST)
ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆందోళన చేయాలన్నా ప్రభుత్వం అనుమతి కావాలనేంత ధీన స్థితిలోకి వెళ్లిపోయారు. వాయిదా మీ వాయిదా పడుతూ చివరకు అక్టోబర్ 7కు ఖాయమయ్యింది. అయితే ఆ దీక్ష అప్పుడైనా జరుగుతుందా..? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. నిరసనలు, దీక్షలు, ఆందోళనలకు కూడా ప్రభుత్వ అనుమతి కావాలనేంత నిస్సహాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయినట్లో... 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై మొదట సెప్టెంబర్‌ 15న దీక్షా తేదీని వైసీపీ ప్రకటించింది. వినాయకచవితి కారణంగా అది కాస్తా సెప్టెంబర్‌ 26కు వాయదా పడింది. అప్పటికే నాలుగు మార్లు సూత్రప్రాయంగా అనుకోవడం మళ్లీ మానేయడంలాంటివి జరిగిపోయాయి. 26న అనుమతి లేకపోయినా నిరాహాదీక్ష చేపట్టాల్సిన జగన్ ప్రభుత్వ అనుమతి లేదని వెనక్కి తగ్గారు. ప్రభుత్వంపై నిరసన తెలపడానికి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అంత మాత్రన ఆందోళనలు ఆగే పరిస్థితి ఉండదు. ప్రతిపక్షాలు ఆందోళన చేయడం, పోలీసులు అరెస్టు చేయడం యథావిధిగా జరిగిపోతాయి. ఇది ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు అనుసరిస్తున్న పద్దతి. అయితే జగన్ ఆ సాంప్రదాయానికి విరుద్దంగా వ్యవహరించారు. 
 
ఐతే గుంటూరు నడిబొడ్డున ఉన్న ఉల్ఫా మైదానంలో దీక్షకు ఏర్పాటు చేసుకోవడం, దానికి పోలీసుల నిరాకరించడంతో జగన్ వెనక్కి తగ్గారు. దీక్షా స్థలం కోసం రెండు, మూడు వేదికలను ప్రతిపాదిస్తూ పోలీసుల అనుమతి కోరారు. చివరికి నల్లపాడు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ స్థలంలో దీక్షకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దీనికి కూడా పోలీసుల నుంచి అనుమతి లేదు. ఇప్పటి వరకూ అభ్యంతరాలు పెట్టకపోయినా.. అనుమతి మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం వచ్చే మౌఖిక ఆదేశాల కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీని అడ్డుకోవడానికి జగన్‌ చేతగాని వాడనే విధంగా ముద్రవేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం చివరి నిమిషంలో పోలీసులను ఉసిగొల్పుతుందనడంలో అనుమానం లేదు.  
 
మరోవైపు పార్టీ దీక్షకు ఏర్పాట్ల జోరుగా చేస్తోంది. ఐతే దీక్షా తేదీ దగ్గరపడుతున్నా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎప్పుడు ఏ సాకు చూపి ప్లెక్సీలు చించేసి.. వేదికను కూలదోస్తారో అనే ఆందోళన మాత్రం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏమౌతుందో తెలుసుకోవడానికి మరో రోజు ఆగక తప్పదు. 

వెబ్దునియా పై చదవండి