వద్దులెండి... పాపం చంద్రబాబును అలా వదిలేద్దాం... ఎవరు?

గురువారం, 13 జూన్ 2019 (19:10 IST)
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాగేశారు. ఇప్పుడు టిడిపికి 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. వైకాపా 151 స్థానాలు గెలుచుకుంటే కేవలం 23 సీట్లతో ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
 
అయితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్నది వైకాపా నేతల ఆలోచన. దీంతో 23 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలతో చర్చలు కూడా జరిపారట వైకాపా సీనియర్ నేతలు. వారిని తమ పార్టీలోకి లాగేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అయితే జగన్ మాత్రం అలా చేయకూడదని పార్టీ నేతలకు సూచించారట.
 
చంద్రబాబు చేసినట్లుగా మనం చేస్తే మనకు విలువ ఉండదు. మనకు ఆ ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు. చంద్రబాబును వదిలెయ్యండి అంటూ వైకాపా నేతలకు సూచించారట. ఈ విషయంపై అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. జగన్ చేసిన వ్యాఖ్యలతో టిడిపి ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు ఖంగుతిన్నారు. ఉన్న ఎమ్మెల్యేలలో కొంతమందిని లాగేసుకుంటే ఇక సభలో ప్రతిపక్షమే లేకుంటే ఎలా అన్న ఆలోచనలో పడిపోయారట చంద్రబాబు. 
 
అయితే ఇప్పుడు కాకపోయినా మరికొన్నిరోజుల్లో అయినా టిడిపికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి వైసిపి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే వారి వద్ద రాజీనామాలు చేయిస్తానని, ఒకవేళ రాజీనామాలు చేయకపోతే మీరే వారిపై చర్యలు తీసుకోవచ్చని కూడా స్పీకర్‌కు విన్నవించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు