దీర్ఘాయుష్మాన్ భవ.. పెరిగిన భారతీయుల ఆయుర్దాయం

బుధవారం, 15 నవంబరు 2017 (13:51 IST)
'ఆరు పదుల వయసు రాగానే అంతా అయిపోయినట్లే!' అనుకునే రోజులు పోతున్నాయి. రోజురోజుకు మెరుగవుతున్న జీవన ప్రమాణాల నేపథ్యంలో మన జీవితకాలం పెరుగుతోంది. అవును నిజమే.. వైద్య సదుపాయాలు, ఆహార నియమావళి, జీవన ప్రమాణాలతో భారతీయుల ఆయుర్దాయం దాదాపు పదేళ్లు పెరిగిందట. ఇన్ఫెక్షన్లు కలిగించే వ్యాధులు, ఇతర ప్రాణాంతక రోగాలు తగ్గడంతో ఇది సాధ్యమవుతోందని గుర్‌గావ్‌కు చెందిన ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ వెల్లడించింది. 1990తో పోల్చితే 2016 నాటికి పురుషుల ఆయుర్దాయం 8.6 సంవత్సరాలు, మహిళల జీవితకాలం 10.6 సంవత్సరాలు పెరిగిందని తెలిపింది.
 
జాతీయస్థాయిలో తెలుగు ప్రజల సగటు జీవితకాలం ఎక్కువగా ఉన్నట్లు ఒక తాజా నివేదిక వెల్లడయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సగటు జీవితకాలం కనీసం మూడేళ్లు అధికంగా ఉందని కూడా తెలిపింది. ఇక 1990 నాటితో పోలిస్తే భారతీయుల జీవితకాలం అంచనా దాదాపు పదేళ్లు పెరిగిందని పేర్కొంది. ‘మనదేశంలో రాష్ట్రాల స్థాయిలో వ్యాధుల భారం’ పేరుతో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), భారత ప్రజారోగ్యసంస్థ(పీహెచ్‌ఎఫ్‌ఐ) సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. 
 
ఈ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే, గత 26 ఏళ్లలో భారతీయుల సగటు ఆయుర్దాయం దాదాపు పదేళ్లు పెరిగింది. 1990లో 59.7 ఏళ్లుగా ఉన్న మహిళల సగటు ఆయుర్దాయం.. 2016 నాటికి 70.3 ఏళ్లకు పెరిగింది. పురుషుల జీవితకాలం అంచనా 58.3 ఏళ్ల నుంచి 66.9 ఏళ్లకు చేరింది. ఈ అంశంలో రాష్ట్రాల మధ్య అంతరాలు హెచ్చుగా ఉన్నాయి. 
 
వాయుకాలుష్య తీవ్రత ఇప్పటికీ అధికంగానే ఉంది. వంట చెరకు వినియోగం తగ్గడంతో ఇళ్ల నుంచి వెలువడే పొగ తగ్గినా, బహిరంగప్రాంతాల్లో వ్యాయుకాలుష్యం మాత్రం పెరుగుతోంది. విద్యుదుత్పత్తి, పారిశ్రామికీకరణ, వాహనాల వినియోగం, నిర్మాణపనులు, వ్యర్థాల కాల్చివేత వంటివి అధికమవ్వడం ఇందుకు ప్రధాన కారణం.
 
ఇకపోతే, సగటు ఆయుర్దాయం ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. 26 ఏళ్లక్రితం వరకు దేశంలో అంటువ్యాధులు పెను దుష్ప్రభావం చూపాయని, అయితే ప్రస్తుతం జీవనశైలితో వచ్చే వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయని వివరించింది ఆ నివేదిక.
 
1990 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 58.4 ఏళ్లుకాగా.. 2016 నాటికి 71.9 ఏళ్లకు పెరిగింది. పురుషుల ఆయుర్దాయం 57.7 ఏళ్ల నుంచి 67.3 ఏళ్లకు చేరుకుంది. ఏపీలో పౌష్టికాహారలోపం సమస్య భారీగా తగ్గింది. 1990లో ఈ సమస్య 36.9 శాతంగా ఉండగా 2016 నాటికి 11.7 శాతానికి తగ్గింది. పొగాకు వినియోగం 2 శాతం పెరిగింది. అధిక రక్తపోటు సమస్య 4.4 శాతం నుంచి 10.5 శాతానికి, కొలెస్టరాల్‌ సమస్య 2.3 శాతం నుంచి 5.9 శాతానికి, ఊబకాయం సమస్య 0.6 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది.
 
రాష్ట్రంలో ఆహార సంబంధిత ముప్పు, మధుమేహం, వృత్తి సంబంధిత ముప్పు, మద్యం, మాదకద్రవ్యాల వినియోగ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయి. నీరు, వాయుకాలుష్య సంబంధిత సమస్యలు తగ్గాయి. 1990లో తెలంగాణ మహిళల సగటు జీవితకాలం 61.8 ఏళ్లుండగా ప్రస్తుతం 73.2 ఏళ్లకు పెరిగింది. పురుషుల ఆయుర్దాయం 60.2 ఏళ్ల నుంచి 69.4 ఏళ్లకు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు