మళ్ళీ వేడెక్కిన నంద్యాల రాజకీయం... ఎందుకంటే..?

గురువారం, 28 జూన్ 2018 (10:46 IST)
నంద్యాల రాజకీయం మళ్ళీ వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అధికారపార్టీ పావులు కదుపుతోంది. పదవిని నిలబెట్టుకునేందుకు వైసీపీ స్కెచ్ గీస్తోంది. పోటాపోటీ వ్యూహాలతో రాజకీయం హీటెక్కింది. నంద్యాల ఉప ఎన్నికల తరువాత మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి.


వైసీపీ చేతిలో ఉన్న మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టిడిపి ఎత్తులు వేస్తోంది. మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న సులోచన పదవిని చేపట్టి నాలుగేళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో అవిశ్వాసతీర్మానం పెట్టి ఆమెను గద్దె దించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
2014 సంవత్సరంలో నంద్యాల మున్సిపాలిటీ 42వార్డులకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీలో ఉన్న శిల్పామోహన్ రెడ్డి వర్గానికి చెందిన 29మంది కౌన్సిలర్లు గెలుపొందారు. వైసీపీకి చెందిన సులోచన ఛైర్మన్ అయ్యారు. అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన 13మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఆ తరువాత భూమా టీడీపీలో చేరడంతో శిల్పా వర్గంలోని కౌన్సిలర్లందరూ భూమా వర్గంలో చేరారు. ఉప ఎన్నికల సమయంలో భూమా వైసీపీలో చేరితే కొంతమంది కౌన్సిలర్లకు ఛైర్మన్ పదవి ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు.
 
ఇప్పుడు నాలుగేళ్ళు పూర్తి కావడంతో ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఛైర్మన్ గిరి కోసం రెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి పోటీలు పడుతున్నారు. అయితే అధికార పార్టీకి అంత సీన్ లేదని, ముగ్గురు, నలుగురికి ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి వారిలోనే గొడవలు పెడుతున్నారంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద రెండు పార్టీలు గొడవలు పడడంతో ఒక్కసారిగా కర్నూలు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు