డైరెక్టర్ మారుతి సమర్పణలో రూపొందిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 29న అనగా నేడు థియేటర్లలో విడుదలైంది. మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు పేరు పెట్టిన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
కథ:
నిధి (మేఘన) సైక్రియాట్రిస్ట్ శ్యామ్ (సత్యరాజ్) మనవరాలు. దేశస్వాతంత్య్రం నాడు స్కూల్ కి వెళ్లిన నిధి తిరిగిరాదు. దానితో కంగారు పడిన శ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అక్కడ SI తన కార్యాలయంలో పోలీస్ (సత్యం రాజేష్) ను శ్యామ్ తో పంపించి వివరాలు తెలుసుకోమంటాడు. వీరిద్దరూ తమకు దొరికిన క్లూలతో నిధి కోసం వేట మొదలు పెడతారు. ఇదిలా వుండగా, అదే ఊరిలో వున్న రామ్ (వసిష్ఠ సింహ) అమెరికా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.
కానీ సరిపడా డబ్బు వుండదు. దానితో తన ఫ్రెండ్, లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) అల్లుడు దేవా (క్రాంతి కిరణ్)తో కలిసి దొడ్డిదారి పనులు చేస్తారు. ఆ పనులు ఏమిటి? మధ్యలో దేవాని దాసన్న(రాజేంద్రన్) వీరిని డబ్బు కోసం బెదిరిస్తాడు? వీరికి నిధి మిస్సింగ్ కు ఏమైనా లింక్ వుందా? నిధి కోసం శ్యామ్ ఏం చేసాడు అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఇది ఓ మర్డర్ మిస్టరీ. ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ దర్శకుడు మోహన్ శ్రీవత్స చూపించిన విధానం ఆకర్షణీయంగా వుంటుంది. టైటిల్ కూడా పురాణాల్లోంచి తీసుకున్నది కావడంతో ఇప్పటికే కల్కి లో అశ్వద్ధామ వంటి పాత్రలు ఇప్పటి జనరేషన్ కు తెలియజేశారు. అలాగే బార్బరిక్ పేరు కూడా నేటి యూత్ కు తెలిసేలా చేశాడు. ఆ క్రమంలో సాగదీతలేకుండా జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు. అందుకే నిడివి రెండు గంటల్లో సినిమా ముగించారు. కథనంలో మలుపులు ఆసక్తికరంగా చూపించారు.
అయితే ఇలాంటి సినిమాల్లో ట్విస్టులు కీలకం. ప్రేక్షకుడి ఊహకు అందనివి వుండాలి. అది సరిగ్గా ఇంటర్వెల్ లో చూపించాడు. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో కీలక పాత్ర సత్యరాజ్ సరైన ఎమోషన్ పండిచలేకపోయాడు. బాహుబలిలో తను చిన్నతనంనుంచి ఎత్తి పెంచిన బాహుబలి కీడు చేయాలనిపించినప్పుడు ఆయన ఎమోషన్ దర్శకుడు పండించాడు. కానీ ఈ సినిమాలో మనవరాలు మిస్ అయితే తాతయ్య ఫీలయ్యే విధానం అంతగా బాగోలేదు.
మహాభారతంలో ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు టైటిల్ పెట్టి ప్రమోషన్స్ లో హైప్ ఇచ్చారు. దానికీ దీనికి పెద్దగా సంబంధంలేదని చెప్పినా, వాటి గురించి ఓ నాటకంలో, అక్కడక్కడా మాములు విజువల్స్ తో చెప్పేసి ఆ మూడు బాణాలకు అర్ధం ఏంటో దానికి తగ్గట్టు విలన్ ని ఎలా చంపారు. కానీ ఎక్కడా కథకు సింక్ అవ్వలేదనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆమెకు సంబంధించిన వాళ్ళు చేతికి మట్టి అంటకుండా ఎలా రివెంజ్ తీర్చుకుంటారనేది కథ. దానని బార్బరీకుడి బాణాల గురించి చెప్తూ అతనికి కథని లింక్ చేయాలని డైరెక్టర్ బాగా ప్రయత్నించాడు.
ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే ప్రస్తుతం, గతానికి తిరుగుతున్నట్టు ఆసక్తిగా రాసుకున్నా అక్కడక్కడా కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సినిమా కొంత సాగదీతగా వుంటుంది. క్లైమాక్స్ లో రెండు మూడు ట్విస్టులు బాగుంటాయి. థ్రిల్లర్ సినిమాకు ఊహించని మలుపులు ఇంకా వుంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగుంది.
నటనాపరంగా చూస్తే, ఆహార్యం, వాయిస్ పరంగా వశిష్ఠ సింహ రెండు వేరియేషన్స్ లో బాగానే మెప్పించాడు. సాంచి రాయ్ ప్రేమతోపాటు బరువైన ఎమోషన్ మోస్తున్న పాత్రలో నటించింది. సత్యరాజ్ సైకియాట్రిస్ట్ ఓకే. మనవరాలి పాత్రలో మేఘన సూటయింది. చాలాకాలం తర్వాత నటిగా ఉదయభాను రీ ఎంట్రీ బాగుంది. కథకు సంబంధం లేకపోయినా తెలంగాణలో లేడీ డాన్ గా న్యాయం చేసింది. శవం చూస్తే మూర్ఛపోయే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే పాత్రలో సత్యం రాజేష్ బాగా నటించాడు. క్రాంతి కిరణ్, వీటివి గణేష్, రాజేంద్రన్, కార్తికేయ దేవ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
కథ చాలా వరకు రాత్రి పూటే జరుగుతుండడంతో సినిమాటోగ్రఫీ పాత్ర కీలకం. తన విజువల్స్ తో మెప్పించాడనే చెప్పాలి. పాటలు యావరేజ్. ఒక రొటీన్ కథని బార్బరీకుడు, అతని మూడు బాణాలకు లింక్ పెట్టి రాసుకోవాలి అనే ఆలోచనకు దర్శకుడిని మెచ్చుకోవచ్చు. ఎడిటింగ్ లో చిన్నపాటి లోపాలున్నా, నిర్మాణ విలువలు బాగున్నాయి. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కి బార్బరీకుడి మూడు బాణాల కథకి లింక్ చేస్తూ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుల ఆదరణ బట్టి ఈ తరహా కొత్త కథలు మరిన్ని వచ్చే అవకాశం వుంది. నేటి యూత్ చూడతగ్గ సినిమా.