పవన్ చూపు తిరుపతి వైపు... ప్రత్యేక హోదాపై టార్గెట్...
గురువారం, 11 ఆగస్టు 2016 (13:13 IST)
ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటివరకు పరోక్షంగా తెలుగుదేశం, బిజెపిలకు మద్దతు పలికిన పవన్, నేరుగా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. జనసేన పేరుతో పార్టీని స్థాపించి రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు లేపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం వూరుకునేది లేదని హెచ్చరించారు పవన్. అలాంటి పవన్ ప్రస్తుతం మెల్లమెల్లగా తిరుపతి వైపు మొగ్గుచూపుతున్నారు. తిరుపతి నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు పవన్ తిరుపతిని ఎంచుకోవడానికి గల కారణమేంటి..?
ప్రజారాజ్యం. ఈ పార్టీ పేరును పెద్దగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే తిరుపతిలో ఈ పార్టీని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించి చతికిలబడ్డారు. పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లోకి విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి అయిపోదామన్న ఆశ చిరంజీవిలో అప్పుడు ఉండడమే అందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్పేవారు. అయితే అదంతా తలకిందులై చిరంజీవి కాస్త రాజకీయాల్లో వెనుకబడిపోయారు. కాంగ్రెస్‌లో విలీనం తరువాత కేంద్రమంత్రి పదవిని సంపాదించుకుని ఐదేళ్లపాటు తాపీగా తిరిగారు.
అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన చిరంజీవి తిరుపతి నియోజవర్గంలో చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమే. సినీపరిశ్రమలో వెలుగొందుతున్న వ్యక్తి కావడంతో పాటు చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారు తిరుపతిలో ఎక్కువ ఉండడమే ఆయన విజయానికి కారణమైంది. అయితే కేంద్రమంత్రి పదవి కోసం ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసేశారు చిరంజీవి. నమ్మి ఓటేసిన జనాన్ని నట్టేట చిరంజీవి ముంచేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు.
పవన్‌కు తన కుటుంబాన్ని ఎవరైనా విమర్సిస్తే అసలు ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి పవన్ నైజం వేరు. అందుకే తన అన్న ఎక్కడైతే అపవాదును మూటగట్టుకున్నారో..ఆ ప్రాంతం నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మెగా కుటుంబమంటే ఇదేరా..అని నిరూపించేందుకు సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అంతటికీ ఉదాహరణలు కూడా ఉన్నాయి. రెండురోజుల క్రితం ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పవన్ తన సన్నిహితుల ద్వారా అందించడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎప్పుడో ప్రత్యేక హోదా కోసం మునికోటి చనిపోతే ఇప్పుడు పవన్ డబ్బులు ఇవ్వడంలో పరమార్థం ఉందంటున్నారు. అదెలాగంటే తిరుపతి నియోజవర్గ ప్రజల్లో ఒక మంచిపేరు సంపాదించేందుకు ఇది ఒక అవకాశంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. మునికోటి లాంటి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే తిరుపతి ప్రజల్లో నిజమైన హీరోగా నిలిచిపోతామని పవన్ భావించారు. అందుకే అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొకటే కాదు తిరుపతిలో ఉన్న జనసేన నాయకులందరికీ కూడా పవన్ కొన్ని సలహాలు, సూచనలు చేశారట. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారికి సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పుకొచ్చారట.
పవన్ చెప్పడం, జనసేన నాయకులు చేయకపోవడమా..ఇక తెలిసిందేగా..పడి..పడి మరీ వీరు పట్టణంలో ప్రజాసమస్యలపై ప్రస్తుతం పనిచేస్తున్నారు. మొత్తం మీద పవన్ తిరుపతి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే ముగ్గురు అగ్రహీరోలు ఈ ప్రాంతం నుంచే పోటీ చేసిన వారవుతారు. అందులో మొదటగా ఎన్‌టిఆర్, ఆ తరువాత చిరంజీవి, మూడవది పవన్ కళ్యాణ్. మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా కోసం నేరుగా రంగంలోకి దిగేందుకు కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.