నంద్యాలలో 40 వేల కాపు ఓట్లు... కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ నిర్ణయం

బుధవారం, 2 ఆగస్టు 2017 (14:22 IST)
నంద్యాల ఉపఎన్నిక పక్రియలో భాగంగా మంగళవారం నుంచి నామిషన్ దాఖలు పర్వం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఆధిపత్యం చాటాలని అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించాలనే విషయంలో జనసేన అధినేత పవన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు? టీడీపీకి మద్దతు ప్రకటిస్తారా? తటస్థంగా ఉండిపోతారా? అనే అంశంపై రాజకీయవర్గాల్లోనే కాదు.. సామాన్యుల్లో కూడా చర్చ సాగుతోంది. దీంతో జనసేన కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 
 
ఎందుకంటే.. పవన్‌ తీసుకునే నిర్ణయం ఉప ఎన్నికలో నిర్ణయాత్మకంగా మారే అవకాశం లేకపోలేదు. దీనికి కారణం నియోజకవర్గంలో 40 వేల పైచిలుకు బలిజ ఓట్లు ఉండటమే. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,09,612 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, బలిజలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. బలిజ ఓటర్లు దాదాపు 42 వేలు ఉంటారని అంచనా. దీంతో పవన్‌ తీసుకునే నిర్ణయం బలిజ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ సామాజికవర్గం అధికార పక్షానికి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీకి పవన్‌ మద్దతిస్తే బలిజ ఓటర్లు ఆ పార్టీకి మరింత పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి అఖిలప్రియా రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో మా కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయన అంటే మాకు ఎంతో ప్రేమ, అభిమానం. మా రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. నంద్యాల ఉప ఎన్నికలో పవన్‌ కళ్యాణ్‌ మద్దతు మాకే ఉంటుంది. ఆ నమ్మకం నాకు బలంగా ఉంది. ఈ ఉప ఎన్నికలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన పార్టీ సేవాదళ్‌ కార్యకర్తలు సహకరిస్తారు. ఇందులో ఎలాంటి సందేహమే లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి