పరమ దారుణంగా ప్రజల పరిస్థితి... రూ. 2000 నోట్ ఇచ్చినా నో యూజ్...
శనివారం, 12 నవంబరు 2016 (22:24 IST)
పెద్ద నోట్లు చెల్లవని.. వాటిని మార్పిడి చేసుకునేందుకు డిసెంబర్ నెలాఖరువరకు ప్రధాని నరేంద్ర మోడీ గడువు పెట్టడం దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. అయితే ఎక్కువగా ఇబ్బందులు పడింది, పడుతున్నది సామాన్యుడు మాత్రమే. దేశం కోసం త్యాగం చేయాలని.. బోర్డర్‌లో సైనికులు త్యాగాల ముందు మనమెంత అంటూ.. ఆవేశపూరిత లాజిక్కులతో సినిమా డైలాగ్‌లు కొట్టడం సెంటిమెంట్ మీద కొట్టడమే. అయితే అందులో నిజం వున్నా... ఈ మార్పిడి వ్యవహారం కొందరు పెట్టుబడిదారులను రక్షించడానికేనని.. తేటతెల్లమవుతోంది. మోదీ తీసుకున్న చర్య సమర్థనీయమని చాలామంది మాట్లాడుతున్నా.. అసలు ఆయనెందుకు ఇలాంటివి తీసుకున్నాడనేందుకు ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా మోడీ గురించి పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారారని మాట్లాడుకుంటున్నారు.బిజెపితో పాటు పలువురి పెట్టుబడిదారుల దగ్గర 2 వేల రూపాయల నోట్లు రావడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు 2 వేల రూపాయల నోటు వల్ల సామాన్యుడికి ఏమిటి ఉపయోగం అనేది అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది.
అయితే ఇందులో ట్విస్ట్ వుంది. పొరుగు దేశమైన పాకిస్తాన్‌నుంచి మన దేశ దొంగనోట్లు తయారవుతున్నాయనీ.. అందుకే కట్టడి చేశామని మోడి చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా తనవద్ద వున్న పెద్దనోట్లను బ్యాన్ చేసే పనిలోవుంది. మరోవైపు... టెర్రరిస్టులు, మావోయిస్టులు ఎవ్వరూ.. పెద్ద నోట్లను చేతుల్లో పట్టుకుని తిరగరు. వారంతా కార్డ్‌లు వాడతారని మాజీ మావోయిస్టులే చెబుతున్నారు.
ప్రయాణంలో పదనిసలు
హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ప్రతి బస్‌లోనూ పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. అదేమని గట్టిగా అడిగితే మాత్రం.. తమ వద్ద చిల్లర లేదని బదులిస్తున్నారు కండక్టర్లు. కేంద్ర ప్రభుత్వం తీసుకోమని చెబుతున్నా.. పెద్ద నోట్లకు చిల్లర సమస్యగా ఆర్‌టిసి చెప్పడం విశేషం. అదేవిధంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనూ.. పెద్ద నోట్లకు ప్రవేశం లేదు అన్నట్లుగా.. తీసుకోవడం లేదని బోర్డులు పెట్టారు. హోటల్స్‌లోనూ ఇదే పరిస్థితి. ఊరు ప్రయాణాలు చేసిన ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం మూడు వందల వరకు బిల్ చేస్తే 500 రూపాయల నోట్ తీసుకుంటున్నారు ప్రతి హోటల్‌వాళ్ళు.
ఇక ఈ నోట్ల సమస్యతో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో బస్సు ప్రయాణీకులు చాలా సేఫ్‌గా చేరుకుంటున్నారు. అన్ని బస్సులు చాలా ఖాళీగా వున్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులో శుక్రవారం నాడు 15 మంది ప్రయాణీకులు వుండటం విశేషం. మధ్యలో రాజమండ్రి, అన్నవరం ప్రాంతాల్లో ప్రయాణీకులు ఎక్కుతున్నా. చిల్లర వుంటేనే ఎక్కండని నిర్మొహమాటంగా చెబుతున్నారు. అదేవిధంగా ఎప్పుడూ బిజీగా వుండే సూర్యాపేట బస్టాండ్‌లోనూ ఇతరచోట్ల క్యాంటిన్‌లు బోసిపోతున్నాయి.
బస్టాండ్‌ల్లోనూ ప్రయాణీకులు తక్కువగానే వున్నారు. ఇక సినిమా థియేటర్లలో ఈగల మోతగా మారింది. నోట్ల వల్ల కొద్దిగా ఇబ్బంది అయినా తప్పని పరిస్థితి అని.. వైజాగ్‌లో ఓ థియేటర్ యజమాని వ్యాఖ్యానించారు. ఇక షూటింగ్‌లలోనూ ఇదే పరిస్థితి. క్రెడిట్ కార్డులతో ఆర్టిస్టులకు రూమ్‌లు బుక్ చేస్తున్నారు. ఎవ్వరూ డైరెక్ట్ క్యాష్ ఇచ్చేందుకు ఆస్కారంలేదు. ఆర్టిస్టులకు భోజన ఏర్పాట్లు కూడా క్రెడిట్ రూపంలో నడుస్తున్నాయి. రాజమండ్రిలో ప్రముఖ చిత్రం షూటింగ్ జరుగుతుంటే.. అక్కడ ఆ ఊరిలోని వారే.. వారికి భోజన ఏర్పాట్లు చేయడం విశేషం.