దేశ రాజకీయాల్లో ఇప్పుడు రజనీకాంత్ రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రజనీ రాజకీయాల్లోకి వస్తాడా.. లేదా? అన్నదే ఇప్పుడు ఉత్కంఠ. అయితే ఆ ఉత్కంఠకు తెరపడేలా మరో వారంరోజుల్లో రజనీ ప్రధానిని కలవాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ రజనీ మాత్రం మోడీని కలవాలన్న నిర్ణయాన్ని మానుకుంటున్నట్లు తెలుస్తోంది. కారణం సోమవారం తన మనస్సు గాయపరిచేలా తమిళర్ మున్నేట్ర పడై పార్టీ చేసిన రాద్ధాంతం. తన స్థానికతపై ఆ పార్టీ కార్యకర్తలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారం రజనీని తీవ్రంగా బాధించిందట. అందుకే రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై వెనక్కి తగ్గాలని నిర్ణయం తీసుకున్నారట.
తమిళ తలైవా రజనీ. పుట్టింది కర్ణాటక. మరాఠా వ్యక్తి. అయితే 44 యేళ్ళ పాటు తమిళనాడులో ఉంటున్నాడాయన. తమిళ సినీపరిశ్రమలోనే కాదు ప్రపంచం మొత్తం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు రజనీ. ఆయన స్టెల్ అంటే చాలామందికి ఎంతో ఇష్టం. అలా తమిళ చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న రజనీకి జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలపై దృష్టి పడింది. అభిమానులు కూడా రజనీని రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెచ్చారు.
దీంతో అభిమానులతో నాలుగు రోజుల పాటు సమావేశం అవ్వడం.. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ తెలిసిందే. అయితే సోమవారం పెద్ద ఎత్తున తమిళర్ మున్నేట్ర పడై అనే పార్టీ కార్యకర్తలు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో ఉన్న రజినీ నివాసంపై దాడికి పాల్పడడం, కోయంబత్తూరులో ఆయన దిష్టిబొమ్మలు కాల్చడం ఇలాంటివి చేయడంతో రజనీ తీవ్ర మనస్థాపానాకి గురయ్యాడట. ఎప్పుడూ శాంతి స్వభావుడుగా ఉండే రజనీ ఇలాంటి పరిణామాలు చూసి బాధపడ్డారట. మరో వారంరోజుల్లో మోడీని కలవాలన్న నిర్ణయాన్ని రజనీ మానుకున్నట్లు తెలుస్తోంది.