పన్నీర్ సెల్వంకు చెన్నైవాసుల ప్రశంసలు... 20 యేళ్ల తర్వాత చెన్నై రోడ్లపై సీఎం పర్యటన
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (16:33 IST)
విషాదకర పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఓ.పన్నీర్ సెల్వం.. అనతికాలంలో చెన్నై నగర వాసుల ప్రశంసలు పొందుతున్నారు. గత రెండు దశాబ్దాల చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాధారణ పౌరుడిలా చెన్నై నగర రోడ్లపై తిరగడం తాము చూడటం ఇదే తొలిసారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేనా వర్దా తుపాను సహాయక చర్యలను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రాంతీయ, జాతీయ మీడియా సైతం అభినందిస్తోంది. ముఖ్యంగా వార్దా తుపాను తీరందాటిన రోజు నుంచి వరుసగా రెండు రోజుల పాటు సచివాలయంలోనే బస చేసి సహాయక చర్యలను సమీక్షించారు. అంతేకాకుండా చెన్నై నగర రోడ్లపై కూలిన వృక్షాలు మూడు రోజుల్లో తొలగించాలంటూ అధికారులను ఆదేశించడమే కాకుండా, అందుకోసం అధికారులను సైతం పరుగులు పెట్టించారు. ఫలితంగానే రోడ్లపై కూలిన భారీ వృక్షాలను సైతం యుద్ధ ప్రాతిపదికన తొలగించి, వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఈనెల 5వ తేదీ అర్థరాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెల్సిందే. అదేరోజు అర్థరాత్రి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన ఎక్కడా కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించడం లేదు కదా.. చివరకు సీఎంకు కల్పించే భద్రత, కాన్వాయ్‌కు సైతం దూరంగా ఉంటున్నారు.
అంతేకాకుండా, నగర రోడ్లపై సాధారణ పౌరుడిలా కార్లలో తిరుగుతున్నారు. అలా తిరుగుతూ స్థానిక నందనంలో ట్రాఫిక్ జామ్‌లో అర్థగంట పాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని పోయారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పటికీ.. ఆయన ఏమాత్రం ఫీల్ కాకుండా నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను స్వయంగా తెలుసుకున్నట్టుగా భావిస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కరుణానిధి (డీఎంకే), జయలలిత (అన్నాడీఎంకే)లు బాధ్యతలు స్వీకరించాక వారికి భారీ వాహన శ్రేణి, భద్రత ఉంటుంది. పైగా.. వారు నగర రోడ్లపై పెద్దగా ప్రయాణించరు. సచివాలయం లేదా తమ నివాసాలు లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. ఎన్నికల సమయంలో మాత్రం నగరంలో చక్కర్లు కొట్టేవారు. అదీకూడా వారు ముందుగా వస్తున్నారనీ ప్రకటించాక... తమ కాన్వాయ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశాక పర్యటించి వెళ్లిపోయేవారు. కానీ, సీఎం పన్నీర్ సెల్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటూ... నగర వాసులతో పాటు మీడియా మన్నలు కూడా పొందుతున్నారు. ఇదే విధంగా ఆయన ముందుకు సాగుతూ పాలన సాగించినట్టయితే ఆయనకు తిరుగే లేదనీ పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.