తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న ఏ. రేవంత్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యంగా, తన శాసనసభ సభ్యత్వానికి మాత్రం స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా సమర్పించారు. అయితే, ఈ లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శికి అందజేశారు. ఇక్కడే మెలిక ఉంది.
ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా చేస్తే అది నేరుగా స్పీకర్‌కు పంపించవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా చంద్రబాబు పీఎస్‌కు అందజేశారు. ఈ లేఖ ఇప్పటివరకు స్పీకర్‌కు చేరలేదు. చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన లేఖ స్పీకర్‌కు వస్తుందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అయితే, జరుగుతున్న పరిణామాలు చూస్తే అంతా పక్కా వ్యూహంతోనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
టీడీపీ పదవులతో పాటు, శాసనసభలో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆయన లేఖలు అందజేశారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపాలని.. చంద్రబాబుకు చెప్పినట్లు రేవంత్ తన సన్నిహితులకు చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీకిగానీ, స్పీకర్ కార్యాలయానికిగానీ రేవంత్ రాజీనామా చేరలేదు.
గతంలో కొందరు ఎమ్మెల్యేలు.. తెరాసలో చేరినపుడు.. పదవులకు రాజీనామా చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రాజీనామాపై మాత్రం టీడీపీ లీడర్లు స్పందించటం లేదు. పైగా రాజీనామా లేఖను చంద్రబాబు.. స్పీకర్‌కు పంపుతారా అన్న ప్రశ్నకు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన రాజీనామాను స్పీకర్‌కు పంపడానికి.. చంద్రబాబు పోస్ట్‌మెన్‌లా కనిపిస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను కోరుకోవటం లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు రాజీనామా లేఖ స్పీకర్‌కు చేరితే.. దాన్ని ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా జరిగితే వచ్చే ఏప్రిల్‌లోగా ఉపఎన్నిక వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు యేడాది ముందు జరిగే ఉప ఎన్నికకు.. ప్రభుత్వం అన్ని అస్త్రాలూ ఉపయోగించి గెలిచే ఆవకాశం ఉంటుంది.
ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ క్యాడర్‌ను పార్టీలో చేర్చుకుంటూ.. ఉపఎన్నికకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమౌతున్నారు. అదేసమయంలో రేవంత్ రాజీనామా తనకు చేరినట్లు.. ఇప్పటివరకు చంద్రబాబు ఎక్కడా క్లారిటీగా చెప్పలేదు. దీంతో రాజీనామా ఇష్యూపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది.