స్వాతి హత్య కేసు : చెన్నై పోలీసులను నీళ్లు తాగించిన రామ్ కుమార్... ఎలా పట్టుబడ్డాడంటే...
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (20:16 IST)
ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో చెన్నై నగర పోలీసులను ఈ ప్రేమోన్మాది ముప్పతిప్పలు పెట్టాడు. చివరకు హైకోర్టు గట్టిగా వేసిన అక్షింతలతో తిరునెల్వేలి జిల్లాలోని అతని ఇంట్లో దాక్కుని ఉండగా శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసులో రామ్ కుమార్ ఆచూకీని పోలీసులు ఎలా కనుగొన్నారో ఓ సారి పరిశీలిస్తే...
24 యేళ్ల స్వాతిని బీఈ పట్టభద్రుడైన రామ్ కుమార్ ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో పాటు.. హేళనగా మాట్లాడటంతో ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్రకారంగా జూన్ 24వ తేదీ ఉదయం 6.30 గంటలకు స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో హత్య చేశాడు. నుంగంబాక్కం రైల్వే బుకింగ్ కమర్షియల్ మేనేజర్ రఘుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎగ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వాస్తవానికి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడం చెన్నై నగర పోలీసులకు సవాల్‌గా మారింది. రోజులు గడుస్తున్నా.. కేసులో ఒక్క చిన్న ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. దీంతో హైకోర్టు సైతం అక్షింతలు వేసి.. నిర్ణీత గడువులోగా నిందితుడిని గుర్తించాలని డెడ్‌లైన్ పెట్టింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన చెన్నై నగర పోలీసులు... రాష్ట్రం నలుమూలలా పరుగులు పెట్టారు. ఈ కేసులో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారించారు.
ముఖ్యంగా స్వాతి నివాసముంటున్న చెన్నైలోని చూలైమేడు, ఉద్యోగం చేస్తున్న మహేంద్రా గోల్డ్ సిటీ పరిసరాలు, తోటి ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు, ఇరుగూపొరుగూ ఇలా ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. అలాగే, ఐదు చోట్ల నుంచి సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని సేకరించి పరిశీలించారు. హత్య చేసి పారిపోతున్నట్లుగా ఉండిన సీసీ టీవీల నుంచి సేకరించిన వీడియోలతో కేసు కొద్దిగా ముందుకు సాగినా నిందితుడు పలానా అని తెలిసినా ఆచూకీ చిక్కకపోవడంతో పోలీసులు తెల్లమొహం వేశారు.
ఈనేపథ్యంలో ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాన్ని తయారు చేసిన పోలీసులు... చివరకు సినీ ఫక్కీలో వ్యూహంపన్నారు. నిందితుడి ఊహా చిత్రాన్ని చూపుతూ చెన్నై నగరం, శివార్లలోని హాస్టళ్లు, మేన్షన్లను ఇలా ప్రతి అణువూ తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో స్థానిక చూలైమేడులోని ఏఎస్ మేన్షన్‌లో నివసించే రామ్ కుమార్ స్వాతి హత్య జరిగిన రోజు నుంచి కనిపించడం లేదని వాచ్‌మెన్ పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఆ తర్వాత మేన్షన్‌కు అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా హత్య జరిగిన రోజున వేసుకున్న దుస్తులతో అతను తిరిగిన వీడియో రికార్డు అయింది. దీంతో అనుమానం బలపడిన పోలీసులు నిందితుడు బస చేసిన రూము తాళాలు పగులగొట్టి సూట్‌కేసులు తనిఖీ చేయగా హత్య చేసినపుడు వేసుకున్న దుస్తులు రక్తపు మరకలతో దొరికాయి.
దీంతో అతడే నిందితుడని ఓ నిర్ధారణకు వచ్చిన పోలీసులు... రామ్ కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడ ఉన్నది ఆచూకీ కనుగొన్నారు. ఆ తర్వాత తిరునెల్వేలి జిల్లా చెంగోట్టైకి సమీపం మీనాక్షిపురం అంబేద్కర్ నగర్ చెందిన పరమశివన్ అనే వ్యక్తి కుమారుడు రామ్‌కుమార్‌ను హంతకుడిగా జూలై 1వ తేదీన నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని తిరునెల్వేలి జిల్లా ఎస్పీ విక్రమన్‌కు చెన్నై నుంచి ప్రత్యేక పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు సమాచారం ఇచ్చారు. తిరునెల్వేలి పోలీసులు మారు వేషం వేసుకుని శుక్రవారం రాత్రి మీనాక్షిపురంలో తిరిగి నిందితుడు ఇంట్లో ఉన్నట్లు ఖరారు చేసుకున్నారు.
అర్థరాత్రి 12 గంటల తర్వాత రామ్‌కుమార్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసుల రాకను గ్రహించిన అతని తాత వెంటనే కేకలు వేసి ఇంట్లోని వ్యక్తులను అప్రమత్తం చేశాడు. ఇంటి వెలుపల ఉన్న పశువుల కొట్టంలో పడుకుని ఉన్న రామ్‌కుమార్ పోలీసులను చూడగానే షేవింగ్ చేసుకునే బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. సరిగ్గా అప్పుడే రామ్‌కుమార్‌ను సమీపించిన పోలీసులు వెంటనే తిరునెల్వేలిఆసుపత్రిలో చేర్పించగా గొంతుపై 18 కుట్లు వేశారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత చెన్నైకు తరలించి విచారణ ఖైదీగా పుళల్ సెంట్రల్ జైలులో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు అధికారులు ప్రకటించడం గమనార్హం.