సినీ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. తద్వారా జనసేనకు అలీ హ్యాండిచ్చాడని సమాచారం. డిసెంబర్ 28వ తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిని అలీ కలిశారు. ఈ భేటీ వెనుక జగన్ రెడ్డి పార్టీలో అలీ జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
రాజకీయ పార్టీల్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ అలీ రాజకీయాల్లోకి రానున్నారు. జనవరి 9వ తేదీన ఇచ్చాపురంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇచ్ఛాపురం సభ వేదికగా జగన్ సమక్షంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారని వైకాపా వర్గాల సమాచారం.
అంతకుముందు 1999లో టీడీపీలో క్రియాశీలకంగా వున్న అలీ.. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్నారు. కానీ పవన్ కల్యాణ్ అంటే అమితంగా అభిమానించే అలీ వున్నట్టుండి జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీతో 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో.. అలీ జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్‌తో కలిసి నెల్లూరులోని రొట్టెల పండుగలో పాల్గొన్న అలీ, జనసేనలో చేరడం దాదాపు ఖాయమే అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు హ్యాండిచ్చి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరాలని అలీ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు అలీ వైసీపీలో చేరిన తరువాత జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.