మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే బ్రతికే ఉన్నారా? ఆర్కే పడిపోయాడంటున్న వేణు... తెలియదంటున్న ఏపీ

గురువారం, 3 నవంబరు 2016 (14:40 IST)
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అసలు ఏమయ్యారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది నక్సలైట్లు హతమైన విషయం తెల్సిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే గాయపడ్డారనే సమాచారం దాదాపుగా ధ్రువీకరణైంది. అయితే, ఇప్పటిదాకా ఆయన పార్టీ కాంటాక్ట్‌లోకి వెళ్లకపోవడంతో, ఆయన ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అనే అంశంపై విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంతకీ ఆర్కే ఎక్కడ ఉన్నట్లు? అడవిలోనే ఉన్నారా? గాయాలతో ఇబ్బందిపడుతున్నారా? గిరిజనుల షెల్టర్లో ఉన్నారా? అన్న ప్రశ్నలకు ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు.
 
ఈ నెల 20వ తేదీన ఆంధ్రా-ఒడిసా సరిహద్దు (ఏవోబీ)లో మావో పార్టీ ప్లీనరీ జరిగింది. దీనికి ఆర్కే హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా సమచారంతో కూంబింగ్ నిర్వహించి ఎన్‌కౌంటర్ చేశారు. ఎదురు కాల్పుల్లో ఆర్కేకు గాయాలయ్యాయని పోలీసువర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. కాల్పులు జరుగుతుండగానే ఆర్కేను ఆయన గన్‌మెన్‌ తీసుకెళ్లారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే ముగ్గురు గన్‌మెన్‌లు కూడా మరణించారని పేర్కొంటున్నాయి. ఆ ముగ్గురిలో ఒకరి పేరును ప్రకటించారు. పోలీసుల వద్ద మరో వ్యక్తి సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఆర్కే సజీవంగా ఉన్నారా చనిపోయారా అనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
 
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారనే సందేహాలను మావో సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే పోలీసుల బందీగా ఉన్నారని విరసం నేతలు కల్యాణరావు, వరవరరావు  మరియు హరగోపాల్‌లాంటి హక్కుల నేతలు సైతం అనుమానాలు వెలిబుచ్చుతుండటం గమనార్హం. పోలీసులే ఆర్కేను పట్టుకున్నారని తక్షణమే వదిలేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మల్కన్ గిరి డివిజన్ కమిటీ కార్యదర్శి వేణు అలియాస్ ప్రసాద్ పేరుతో మీడియాకు అందిన స‌మాచారంతో దీనిపై కొంత స్పష్టత వచ్చింది. ఆర్కే ఆ రోజు అక్కడే వున్నారని వేణు స్పష్టం చేశారు. పోలీసులు ఒక్క సారిగా దాడి చేశారని, బుల్లెట్ల జడివాన నుంచి తప్పుకుని ప్రతి దాడి చేసే అవకాశం దొరకలేదని ఆయన అన్నారు. ఆర్కేతో పాటు తాను, మరికొంతమంది తప్పించుకోవటానికి పరుగులు పెట్టామని ఆయన వివరించారు. ఆ క్రమంలో బుల్లెట్ తగిలి ఆర్కే పడిపోవటాన్ని గమనించానని వేణు వివరించారు. ఆర్కే మృతి చెందాడని ఆయన పార్థీవ దేహాన్ని పోలీసులు దాచిపెట్టారని వేణు ఆరోపించారు.
 
ప్లీనరీకి హాజరైనట్లు చెబుతున్న 50 మందిలో 30 మంది మావోయిస్టులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. పోలీసులు కూడా 24న జరిగిన కాల్పుల ఘటనలో 50 కిట్‌ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ప్లీనరీకి హాజరైన 50 మందిలో 30 మంది మృతిచెందగా మిగిలిన వారిలో కొంతమంది పోలీసులు అదుపులోనే ఉన్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దొరికిన మావోయిస్టులను చిత్రహింసలకు గురిజేసి దఫదఫాలుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందుతున్నట్లు పోలీసులు ప్రకటిస్తున్నారని మల్కాన్‌ గిరి ఏరియా కార్యదర్శి వేణు ఆరోపిస్తున్నారు. తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో బలిమెల రిజర్వాయర్లలో పడి కొంతమంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. వారిలో ఆర్కే ఉన్నారా? లేక ఆయన మృతి రహస్యంగా ఉంచి తీవ్రతను తగ్గించాలని పోలీసులు చూస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆర్కే అదృశ్యం వ్యవహారం పోలీసుల కంటే ముందు మావోయిస్టు పార్టీలో ఎక్కువ కలకలం రేగుతున్నట్లు తెలుస్తోంది. మామూలుగా అగ్రనాయకులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అందుకే వీరు అంత సామాన్యంగా టార్గెట్‌గా మారరు. ఏదైనా జరిగితే పార్టీకి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్లేలా వ్యవస్థ కూడా ఉంటుంది. కానీ ఎన్‌కౌంటర్ జరిగి రోజులు గడుస్తున్నా ఆర్కే సమాచారం పార్టీకి కూడా తెలియలేదు. ఎన్ కౌంటర్ నుంచి ఆర్కే సేఫ్‌గా తప్పించుకుని ఉంటే కచ్చింతగా పార్టీకి సమాచారం వెళ్లి ఉండేదని, ఇంతటి ఆందోళన వ్యక్తమయ్యేదే కాదనీ అంచనా వేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులైన ప్రజాసంఘాల నేతలు కూడా ఏఒబి జరిగిన మొదట్లో ఆర్కే గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఆర్కే ఆచూకీపై పోలీసులపై ఆరోపణలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా పోలీస్ కస్టడీలోనే ఆర్కే ఉన్నారని, ఆయనను వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆర్కే భార్య శిరీష డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ పైన చాలా అనుమానాలు ఉన్నాయని, ఎన్ కౌంటర్ తర్వాత మరుసటి రోజుకు మృతుల సంఖ్య పెరగడం, కొన్ని మృతదేహాలను గుర్తించకుండా ఖననం చేయడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ఆమె అంటున్నారు.
 
అయితే ఈ ఆరోపణలను పోలీసులు బలంగానే ఖండిస్తున్నారు. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఆర్కే తప్పించుకున్నారని, తమ వద్ద లేడని వారు స్పష్టం చేస్తున్నారు. గాయాలతో కాని - ప్రాణాలు లేకుండా కానీ ఆర్కే తమకు దొరకలేదని, ఇది మావోయిస్టులు చేస్తున్న మైండ్ గేమ్ మాత్రమేనని పోలీసులు తిప్పికొడుతున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఆర్కే చురుగ్గా లేడంటూ లీకులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, గాయపడినవారు లొంగిపోతే వైద్యం చేయించడానికి సిద్ధమని పోలీసులు వ్యూహాత్మక ఎత్తుగడను అమలు చేస్తున్నారు. దీంతో ఆర్కే యోగక్షేమాలపై పార్టీ వర్గాలు, ప్రజా సంఘాలు, సానుభూతిపరులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసుల కస్టడీలో ఉన్నారో తెలపాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. 
 
ఒకవేళ పోలీసుల కస్టడీలో ఉంటే  ఆర్కేకు ఎలాంటి ప్రాణహానీ తలపెట్టవద్దని ఆదేశించింది. ఎన్ కౌంటర్ జరిగి ఇన్నిరోజులు అయినా వివరాలు తెలిపేందుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. దీనిపై ఇవాళ జరిగిన విచారణలో ఆర్కే తమ వద్ద లేరని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒడిశా పరిధిలో జరిగింది కనుక మరింత దర్యాప్తు చేసి వివరాలను కనుగొనాల్సి ఉందని తెలిపింది. కాగా ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారనేందుకు ఏమయినా ఆధారాలు ఉన్నాయా అని పిటీషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఆధారాలను సమర్పించేందుకు 10 రోజుల సమయం కావాలని పిటీషనర్ కోరారు.

వెబ్దునియా పై చదవండి