అన్నాడీఎంకే నుంచి శశికళ - దినకరన్ బహిష్కరణ... ప్రధానకార్యదర్శిగా ఓ పన్నీర్ సెల్వం!
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (08:58 IST)
అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌ను బలవంతంగా పార్టీ నుంచి గెంటివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వేసిన ఎత్తులు ఫలించాయి. మన్నార్గుడి మాఫియాగా పేరొందిన శశికళ వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తే తమ వర్గాన్ని అన్నాడీఎంకేలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో పాటు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, పార్టీ సీనియర్ నేత అయిన తంబిదురై సైతం మెత్తబడ్డారు. వీరంతా కలిసి శశికళతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి బయటకు పంపాలని నిర్ణయించారు. అవసరమైతే వారిని బలవంతంగా బహిష్కరణవేటు వేయాలని భావిస్తున్నారు.
ఇందుకోసం అన్నాడీఎంకే రెండు వర్గాలనూ ఏకం చేసేందుకు సోమవారం సాయంత్రం నుంచి అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిలాయి. పార్టీలో, ప్రభుత్వంలో తనపై తిరుగుబాటు పెరుగుతుండటం, ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదు కావడంతో దినకరన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దాంతో, తన పిన్ని శశికళను కలిసేందుకు ఆయన సోమవారం మధ్యాహ్నం హుటాహుటిన బెంగళూరు వెళ్లారు.
ఆ వెంటనే, ‘కలయిక కోసం చర్చించేందుకు సిద్ధం’ అంటూ ఓపీఎస్ ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలను కలిపేందుకు సీనియర్ మంత్రులొస్తే చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటించారు. అందుకు తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. దానిని, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై స్వాగతించారు. అన్నాడీఎంకే పాలన సుస్థిరంగా సాగాలంటే రెండు వర్గాలు కలిసి సాగడమే మంచిదని అన్నారు.
మరుక్షణమే ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రులు జయకుమార్, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం, తంబిదురై సమావేశమయ్యారు. విలీనంపై చర్చించారు. అనంతరం ‘‘ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం. పార్టీలో మనస్పర్ధల కారణంగానే కొందరు దూరమయ్యారు. మళ్లీ నేతలంతా ఒకే గూటి కిందకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. ఆ తర్వాత ‘చెన్నైకి వచ్చిన ఐఎన్ఎస్ యుద్ధ నౌకను వీక్షించేందుకు తక్షణం చెన్నై తరలి రండి’ అంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా సోమవారం రాత్రే చెన్నైకు పయనమయ్యారు. వీరంతా మంగళవారం సమావేశమై పార్టీల ‘విలీనం’పై ఎమ్మెల్యేలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇందుకోసమే ఎమ్మెల్యేలను పిలిపిస్తున్నారని పార్టీ అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పన్నీరు సెల్వంను ఈ సమావేశంలోనే ఎన్నుకొనే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దాంతో, ఎడప్పాడి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని, పార్టీ మాత్రం పన్నీరుసెల్వం చేతికి రానుందని వివరిస్తున్నాయి.