ఆ తప్పులు చేసిన విజయశాంతి, లేదంటే ఈపాటికే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి అయ్యేవారే

బుధవారం, 28 అక్టోబరు 2020 (20:46 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
రాములమ్మగా పిలుచుకునే విజయశాంతి పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. కారణం తాజాగా ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో దాదాపు గంటన్నర పాటు భేటీ కావడమే. ఈ భేటీలో తిరిగి సొంతగూటికి రమ్మంటూ కిషన్ రెడ్డి ఆహ్వానించారంటూ వార్తలు వచ్చాయి. దీనికి రాములమ్మ కూడా అంగీకరించారంటూ మీడియాలో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇవాళ అయితే అది కాస్త మరింత హీట్ పెరిగి భాజపాలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందంటూ ప్రచారం జరిగింది. దీనితో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు.
 
పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ ఈ ఉదయం విజయశాంతి ఇంటికి వెళ్లి మాట్లాడారు. దుబ్బాక ఎన్నికల పర్యటనకు కోవిడ్ కారణంగా ఆమె రాలేకపోతున్నానని తనతో చెప్పారన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే వుంటారనీ, పార్టీ మారుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని మీడియాతో చెప్పారు.
ఇక అసలు విషయానికి వస్తే... విజయశాంతి ఎప్పుడో కేంద్రమంత్రి అయ్యుండేవారు. గతంలో ఆమె భాజపాలో చేరినప్పుడు కేంద్ర పెద్దలు అద్వానీతో సహా అప్పట్లో బడా నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం వుండేది. అలాగే ఆమె భాజపాలో కొనసాగినట్లయితే ఈసరికే ఆమె కేంద్రమంత్రి అయ్యుండేవారనే వాదన వుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెరాసతో వున్న రాములమ్మకి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేసారు. ఐతే కొన్ని అభిప్రాయభేదాల వల్ల తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు విజయశాంతి.
 
కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయి తెరాస ఘన విజయం సాధించింది. ఆ సమయంలో కనీసం ముక్కూమొహం తెలియనివారిని కూడా మంత్రి పదవులు వరించాయి. ఆ సమయంలో విజయశాంతి పార్టీనే అంటిపెట్టుకుని వుంటే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కి వుండేదన్న వాదనా వుంది. ఇలా మంత్రి పదవి చేయి దాకా వచ్చే తరుణంలో విజయశాంతి పార్టీలు మారడం వల్ల ఆమెకి పదవి ఆమడ దూరంలోనే వుండిపోయింది.
ఇక తాజాగా మరోసారి ఆమె పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినట్లే హస్తం పార్టీలోనే కొనసాగుతారా మరోసారి కమలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భాజపాలో చేరుతారా చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు