ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

బుధవారం, 5 సెప్టెంబరు 2018 (18:12 IST)
మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఏ అంశాన్నయినా సునిశితంగా, లోతుగా అధ్యయనం చేస్తారు. ఏది మాట్లాడినా రికార్డెడ్‌గా మాట్లాడుతారు. ఉండవల్లి వేసే ప్రశ్నలు బాణాల్లాగే ఉంటాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైకి కొన్ని బాణాలు వదిలారు అరుణ్‌ కుమార్‌. రాష్ట్ర విభజన చెల్లదని వాదిస్తున్న అరుణ్‌ కుమార్‌ తెలుగుదేశం పార్టీ ఎంపిలు లోక్‌సభలో ఏం మాట్లాడాలో ఆమధ్య ముఖ్యమంత్రికి లేఖ రాశారు ఆయన. ఇదే అదనుగా ఉండవల్లిని పిలిచి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 
 
ఉండవల్లి ఇచ్చిన సలహా మేరకు పార్లమెంటులో టిడిపి ఎంపిలు మాట్లాడారా లేదా అనేది పక్కనపెడితే… ఉండవల్లి తమ పోరాటాన్ని గుర్తించారనే ఒక విధమైన సానుకూల సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఉండవల్లి ఏంటి… చంద్రబాబును కలిసి సలహాలు ఇవ్వడం ఏంటి… అని అందరూ అనుకుంటున్న తరుణంలో కాస్త ఆలస్యంగానైనా తనదైన శైలిలో స్పందించారు ఉండవల్లి. ప్రభుత్వంపై పదునైన బాణాలను ఎక్కుబెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 10.35 శాతం వడ్డీ ఇచ్చేలా జారీ చేసిన రాజధాని బాండ్లను ఎవరు కొనుగోలు చేశారో చెప్పాలని ఉండవల్లి నిలదీశారు. 
 
బాండ్లు కొనేవారిని దృష్టిలో ఉంచుకునే ఎక్కువ వడ్డీ ప్రకటించారన్న ఆరోపణలున్న ఈ ఉదంతంలో… బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పేర్లను రహస్యంగా ఉంచింది ప్రభుత్వం. అలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఉండవల్లి మొదటి ప్రశ్న. ఈ వ్యవహారంలో ఏకె కేపిటల్‌ అనే పేరుతో వచ్చిన వ్యక్తికి రూ.17 కోట్ల కమీషన్‌ (బ్రోకరేజ్‌) ఇవ్వడాన్నీ ఉండవల్లి తప్పుబట్టారు. గతంలో చంద్రబాబుకు విజన్‌ 2020 డాక్యుమెంట్‌ ఇచ్చిన మెకన్సీ ప్రస్తుతం జైల్లో ఉన్నారన్న విషయాన్ని వెల్లడించారు. అంటే… ఈ బాండ్ల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని ఆయన గట్టిగానే చెప్పారు.
 
ఇక మద్యం అమ్మకాలతో ప్రభుత్వం జనం శ్రమను దోచుకుంటోందని చెప్పారు. ఛీఫ్‌ లిక్కర్‌ తయారీ, రవాణాకు రూ.8.50 ఖర్చవుతుండగా… రూ.50కు విక్రయిస్తున్నారని చెప్పారు. ఇందులో వైన్స్‌ షాపుల వారికి ఇచ్చేది రూ.3.75 మాత్రమేనని, మిగతాదంతా ప్రభుత్వానికే వెళుతోందని చెప్పారు. మద్యంతో ఇంత భారీగా దోపిడీ చేయడం ఏమిటదనేది ఆయన లేవనెత్తిన కీలకమైన ప్రశ్న. 
 
ఇక రాష్ట్ర ప్రభుత్వ అప్పులపైనా ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం 2,25,234 కోట్లు అప్పులో ఉందని, ఈ నాలుగేళ్లలోనే 1.30 లక్షల కోట్లు అప్పు తెచ్చారని, ఈ డబ్బంతా ఏమయిందని ప్రశ్నించారు. ఇక పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగిపోతుండటంపై చంద్రబాబు స్పందిస్తూ… పెట్రోలు ధర రూ.100 చేస్తారేమో అని ప్రజల మీద ప్రేమ వున్నట్లు, బిజెపిని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. దీనికి ఉండవల్లి కౌంటర్‌ ఇచ్చారు. పెట్రోలు వాస్తవ ధర రూ.32 మాత్రమేనని, అయితే రూ.85కు విక్రయిస్తున్నారని అన్నారు. ఇందులో రూ.19 మాత్రం కేంద్రానికి వెళుతుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతోందన్నారు. కేరళలోలా పెట్రోలు ధరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెళుతుంది. కేంద్రానికి ఎంత వెళుతుందో తెలియజేసేలా బిల్లులు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌సిపి కంటే ఉండవల్లి సమగ్ర అధ్యయనంతో, వివరాలతో మాట్లాడారు. ఇవే అంశాలపై ఇప్పటిదాకా వైసిపి ఇంత స్పష్టంగా మాట్లాడిన ఉదంతాలు లేవు. ఉండవల్లి మూడు నెలలకో... ఆరు నెలలకో ఒక ప్రెస్‌మీట్‌ పెట్టినా అది కొన్ని నెలల పాటు చర్చనీయాంశంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు లేవనెత్తిన అంశాలపైనా అటువంటి చర్చ జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు