అమరావతి బాండ్ల కోసం ఎగబడుతున్నారు... భాజపా విషం కక్కుతోంది....

మంగళవారం, 28 ఆగస్టు 2018 (21:32 IST)
అమరావతి: అమరావతి బాండ్లకు బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్(బీఎస్సీ)లో అద్వితీయమైన స్పందన వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సి.కుటుంబరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల విలువ గల బాండ్లు జారీ చేసిన గంట వ్యవధిలోనే బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరినట్లు చెప్పారు. ఆశించిన దానికంటే ఒకటిన్నర రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యిందని తెలిపారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇంత స్పందన వచ్చిందన్నారు. ఇది గొప్ప విజయంగా పేర్కొన్నారు.
 
బాండ్ల విడుదలతో జాతీయ, అంతర్జాతీయ మదుపరుల్లో రాష్ట్ర ఇమేజ్ పెరిగిందని చెప్పారు. ముంబాయ్‌లో సోమవారం జరిగిన బాండ్ల లిస్టింగ్‌ (బాండ్లను కొనుగోలు చేసిన సంస్థలకు స్టాక్‌ మార్కెట్‌లో ఇతరులకు విక్రయించుకునే వీలు కల్పించడం) కార్యక్రమానికి దేశంలోని వ్యాపార దిగ్గజాలు హాజరైనట్లు తెలిపారు. ముఖేష్ అంబానీ, గోద్రోజ్, కుమార మంగళం బిర్లా, మహేంద్ర గ్రూప్ ప్రతినిధులు, బీకే గోయంకా, రహేజా సంస్థ ప్రతినిధులు వంటి వారు అనేకమంది వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు కూడా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు.
 
రాష్ట్రం విడిపోయిన క్లిష్టమైన పరిస్థితులలో రాజధాని నిర్మాణానికి హామీ మేరకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే అవకాశం ఉన్న అన్ని మార్గాలలో నిధులు సమీకరిస్తోందన్నారు. అందులో భాగంగానే బాండ్లు విడుదల చేసినట్లు తెలిపారు. కేంద్రం సాయం చేయకపోయినా చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఓర్వలేకోతున్నారన్నారు. ఈర్ష్యతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్రం లక్షల కోట్లు సేకరించే చోట, సెబి వంటి స్వతంత్ర సంస్థ బాండ్ల విడుదలను నియంత్రిస్తుందని, ఇటువంటి కార్యక్రమంలో అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. 
 
బాండ్ల విడుదల వ్యవహారం అంతా పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసినా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రుజువు చేయలేని పక్షంలో ఆయన రాజీనామా చేస్తారా? కనీసం క్షమాపణలైనా చెబుతారా? అని అడిగారు. ఎందుకు ఇలా విషం కక్కుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారు నష్టపోతారని చెబుతున్నారని, వారు ఎలా నష్టపోతారని ప్రశ్నించారు.
 
అనిల్ అంబానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని, భారతదేశ ఇమేజ్ దిగజారిందని చెప్పారు. అటువంటి కంపెనీలకే కేంద్రం డిఫెన్స్‌కు సంబంధించిన భారీ కాంట్రాక్టులు ఇస్తూ సపోర్ట్‌గా ఉంటుందన్నారు. గుజరాత్‌లో నష్టాల్లో, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన జీఎస్పీసీని ఓఎన్జీసి చేత కొనుగోలు చేయించారని పేర్కొన్నారు. బీహార్‌లో శ్రీజమ్ స్కామ్ భారీ స్థాయిలో జరిగిందని చెప్పారు. జీవిఎల్ వంటి వారు అటువంటి అంశాలను ప్రశ్నించరన్నారు.
 
బాండ్ల వడ్డీ రేటు, ఎరేంజర్ ఫీపై కూడా అర్ధంపర్ధంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే ఆ చెల్లింపులు జరిగాయని, ఎక్కువ ఇవ్వడంలేదని తెలిపారు. సంస్థల రేటింగ్ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారని చెప్పారు. ట్రిపుల్ ఏ, డబుల్ ఏ, ఏ, ఏ ప్లస్ వంటి రేటింగ్ లు ఆదారంగా వడ్డీ రేటు ఉంటుదని తెలిపారు. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న పవర్ గ్రిడ్, ఆర్ఇసీ వంటి రూ.20 వేల కోట్లు రిజర్వు ఫండ్స్ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూడు నెలల క్రితం 9.49 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేసినట్లు వివరించారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్పీసీ విస్తరణ కోసం రూ.1000 కోట్లకు బాండ్లు విడుదల చేశారని, వాటి వడ్డీ రేటు 10.45 శాతం అని, ఎరేంజర్ ఫీ 1.5 శాతం అని తెలిపారు. వాటి కాల పరిమితి 60 ఏళ్లని చెప్పారు. 
 
ఆ తరువాత జీఎస్సీసి గ్యాస్ పంపిణీ కోసం విడుదల చేసిన బాండ్లకు వడ్డీ రేటు 10.30 శాతం, ఎరేంజర్ ఫీ 1.5 శాతం అని తెలిపారు. అమరావతి కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టాక్స్ ఫ్రీ బాండ్లకు అనుమతి ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడంలేదని చెప్పారు. 2014 నుంచి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో ప్రత్యేక అంశంగా భావించి అనుమతి ఇవ్వవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్ హెచ్ఏ, పవర్ ఫైనాన్స్ వంటి సంస్థలకు టాక్స్ ఫ్రీ బాండ్లకు అనుమతి ఇస్తుందన్నారు.   ఆర్థిక అంశాలు తెలియకుండా విమర్శించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం తప్పన్నారు. ఆర్థిక అంశాలను నేర్చుకోవాలని, అవసరమైతే నేర్పుతామని చెప్పారు. ఆర్థిక అంశాలపై శిక్షణకు సెబి నేతృత్వంలో కార్యక్రమాలు కూడా కేంద్రం నిర్వర్తిస్తోందన్నారు.
 
దేశంలోని అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ అమరావతి అని కుటుంబరావు  తెలిపారు. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.48,115 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 56 ప్రాజెక్టులని, వాటిలో 36 మొదలయ్యాయని తెలిపారు. అమరావతి అభివృద్ధి పనులను చేపట్టడంలోగానీ, నిధులు సమకూర్చుకోవడంలో గానీ సీఆర్డీఏ సమర్థవంతంగా వ్యవహరిస్తోందన్నారు. చేయగలిగిన పనులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే సీఆర్డీఏ విడతలవారీగా అప్పులు సేకరిస్తోందని చెప్పారు. నిధుల కొరత లేకుండా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నట్లు తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ నిధులు సేకరిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి సీఆర్డీఏకు ఆదాయం కూడా మొదలవుతుందని చెప్పారు. ప్లాట్లు పంపిణీ చేస్తున్నారని, యూజర్, అనుమతుల ఛార్జీలు వస్తాయని, అది స్వయంసమృద్ధి దిశగా వెళుతోందన్నారు. 
 
పీడీ ఖాతాలను కూడా తరచూ విమర్శించడం అలవాటైపోయిందన్నారు. రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) విధానం ద్వారా ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన విమర్శలలో కూడా వాస్తవం లేదన్నారు. ఒక్క నెలకు మించి బకాయిలు పెండింగ్ లో లేవని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. బయటివారికే నమ్మకం లేదన్నారు. అమరావతి నగరం అద్వితీయంగా రూపొందుతుందని కుటుంబరావు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు