#WorldEnvironmentDay : వాయు కాలుష్యాన్ని ఓడిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్ధాం....

బుధవారం, 5 జూన్ 2019 (10:50 IST)
ప్రతి యేటా జూన్ ఐదో తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తొలిసారి 1972లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుంచి జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా, ఆ యేడాది నుంచి ప్రతి యేడాది ఏదో ఒక దేశంలోని ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేకాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు.
 
మనిషి జీవించడానికి పర్యావరణంలో భాగమైన గాలి, నీరు, నేలనుంచి లభిస్తాయి. దీంతో చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటి నుంచి దొరుకుతాయి. అవిక్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలుగుతాం. అయితే, ఇపుడు మానవుడు తన మేథోసంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతూ పర్యావరణానికి పూర్తిగా హాని చేస్తున్నాడు. 
 
ఫలితంగా మనిషి పీల్చేగాలి, తాగే నీరు, తినే ఆహారం ఇలా ప్రతిదీ కలుషితమైపోతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి అడ్డగోలుగా వినియోగిస్తున్నాడు. అంతేకాదు ప్లాస్టిక్ బ్యాగుల వాడకం, మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కూడా పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తున్నాయి. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా మురికిమయం చేస్తున్నారు. దీంతో సముద్ర జలచరాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. 
 
శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది. కనుక ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే, ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి. దీనికి పర్యావరణ పరిరక్షణ ఒక్కటే నివారణ మార్గమని ఐక్యరాజ్యసమితి కూడా నినదిస్తోంది. అందులోభాగమే, ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి యేటా నిర్వహిస్తున్నారు. 
 
అయితే, విజృంభిస్తున్న ప్రపంచ ఉద్గారాల (గ్లోబల్ ఎమిషన్స్)ను తక్షణం కట్టడి చేయడం మొదలు పెట్టకుండా ఇలాగే ఆయా దేశాలన్నీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ వైఖరి ఇలానే కొనసాగినట్టియితే మరికొద్ది దశాబ్దాలలోనే అత్యంత భయంకరమైన పర్యావరణ విపత్తును ఎదుర్కోవలసి ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
భూమికి పెడుతున్న ఈ మంటల్ని నియంత్రించకుండా ఇలాగే ఇంకా పెంచుకొంటూ పోతుంటే మరికొన్ని దశాబ్దాలలో మానవజాతి ప్రళయ విలయాన్ని చవిచూడవలసి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, ఈ శతాబ్ది (2100) చివరికల్లా భూమి వాతావరణ సగటు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ (9 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరుకోగలవని, ఫలితంగా సముద్రమట్టాలు అసాధారణంగా (7.8 అడుగులు) పెరుగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
 
అంటే, ఈ శతాబ్దం ఆఖరుకు సముద్ర మట్టాలు కనీసం 6 అడుగులకు చేరుతాయని, ఇది గత అంచనాలకు రెండింతలు అధికమని కూడా ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. అనేక ప్రపంచ నగరాలకు, లక్షలాదిమంది ప్రజలకు పెద్దముప్పు పొంచి ఉందని, బంగ్లాదేశ్ వంటి దిగువ (భౌగోళికంగా) దేశాలు, న్యూయార్క్, లండన్ వంటి ప్రధాన మహానగరాలకు పెను జలవిలయం తప్పదని కూడా వారు హెచ్చరించారు. సుమారు 7.8 అడుగుల మేర సముద్రమట్టాలు గనుక పెరిగితే 2.40 కోట్ల మంది ప్రజలు జలసమాధి కావచ్చునని హెచ్చరిస్తున్నారు.
 
అంతేకాకుండా, ఐక్యరాజ్య సమితి తాజా హెచ్చరిక మేరకు.. ఐక్యరాజ్యసమితి (ఐరాస) తాజా నివేదిక ప్రకారం మరికొన్ని దశాబ్దాలలో సంభవించనున్న ఆరో మహా వినాశనం మూలంగా దాదాపు లక్ష వరకు వివిధ వృక్షజంతు జాతులకు పెనుముప్పు పొంచివుందని హెచ్చరించింది. ఇందులో 40 శాతం ఉభయచరాలు, 33 శాతం సముద్ర క్షీరదాలు, తదితర జలచరాలు, పగడపు దిబ్బలు ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. 
 
కాగా, 2100 సంవత్సరాల నాటికి మూడింట రెండు వంతుల హిమాలయ మంచుకొండలు కరిగి పోతాయని ది హిందూ కుష్ హిమాలయ అసెస్‌మెంట్ అంచనా వేసింది. ఫలితంగా భూమిమీది అనేక ప్రదేశాలు జలప్రళయాన్ని ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల వాయు కాలుష్యాన్ని ఓడిద్దాం (Beat Air Pollution) అనే స్ఫూర్తితో ఇప్పటికైనా ప్రతి ఒక్కరం ప్రకృతి పరిరక్షణ చర్యలకు ఉపక్రమిద్దామని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు