భద్రాచలం : హీరోకే కాదు... విలన్‌కు కూడా ఫ్యాన్స్ ఉంటారు. దేవుడినే కాదు... రాక్షసులనూ పూజించేవాళ్ళుంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ పోస్టర్. ద్రవిడ మహారాజ నరక వీర జయంతి అంటూ... భద్రాచల రామక్షేత్రంలో నరకాసుర సంతతి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. నాడు బ్రాహ్మణ మూక కుతంత్రాలపై తిరుగుబాటు చేసిన ధర్మ పరిపాలకుడు, ఆర్తజన పక్షపాతి నరకాసురుడని ఇందులో శ్లాఘించారు.
అమ్మలపై ఆయుధాలను ఎక్కుపెట్టని ధర్మ నిరతుడు, గొప్ప శాంతి కాముకుడు, నరక వీర మహారాజని కొనియాడారు. ఇంతటి రాజును ఆర్య, ఇరానియన్ రాజైన కృష్ణుడు కుటిల నీతితో ధర్మాన్ని విడిచి తల్లి లాంటి సత్యభామను ఎరవేసి నరకాసురుడిని హత్య చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరక వీర మహారాజుని హత్య చేసిన రోజును నిరసిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నాడు నరక వీరుడు, బలి చక్రవర్తులు నేడు దభోల్కర్, గోవింద్ పన్సారేలను కూడా ఇలాగే బలి చేశారని, యదార్ధ వాది ఏ కాలంలోనైనా లోక విరోధి అని పేర్కొన్నారు.