దీపావళి రోజంటే యమధర్మరాజుకు ప్రీతికరమట.. ఎందుకంటే?

బుధవారం, 11 నవంబరు 2020 (17:59 IST)
Diwali
ఆశ్వయుజ చతుర్దశి, దీపావళి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. 
 
అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ''యమాయయః తర్పయామి'' అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని విశ్వాసం. 
 
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.
 
చతుర్దశ్యాం తు యే దీపాన్‌
నరకాయ దదాతి చ|
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్‌ స్వర్గ మాప్నుయుః ||
చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు