హరికృష్ణకు బాబు హ్యాండ్.... బిజెపి నుంచి చేస్తావా... వెంకయ్య మంతనాలు

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (13:53 IST)
WD
తెదేపా సీనియర్ నాయకుడు, ఎన్టీఆర్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాదాపు హ్యాండ్ ఇచ్చినట్లే తెలుస్తోంది. టిడిపి ప్రకటించిన 5 జాబితాలలోను హరికృష్ణ పేరు రాకపోవడంతో ఇక హరి పని హరిగోవిందా అని అంటున్నారు. హరికృష్ణకు అంతకుముందు రాజ్యసభ సీటులోనూ మొండిచెయ్యి చూపిన బావ చంద్రబాబు అసెంబ్లీకి కూడా అదే పద్ధతిని కొనసాగించేట్లు కనబడుతోంది. దీంతో హరికృష్ణ వర్గీయులు కుతకుతలాడుతున్నారు.

మరోవైపు హరికృష్ణను భాజపా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే హరి సోదరి పురంధేశ్వరి రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి ఇప్పటికే విజయవాడ లోక్ సభ నుంచి పోటీ చేయాలని అనుకుంటుండంతో హరికృష్ణను కూడా రంగంలోకి దింపితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని భాజపా నాయకులు అనుకుంటున్నారు.

చివరి నిమిషంలో చంద్రబాబు కొట్టిన దెబ్బకు భాజపా కుదేలయ్యింది. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా అభ్యర్థులను వెతుక్కోవడం కూడా తలకు మించిన భారం కానున్నది. చంద్రబాబు నాయుడు ఇలా నట్టేట ముంచుతారని తాము అనుకోలేదని భాజపా నాయకులు మండిపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి