మెదక్ నుంచి విజయశాంతి.. మహబూబ్ నగర్‌లో జైపాల్ రెడ్డి!!
గురువారం, 27 మార్చి 2014 (12:17 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేయగా, ఇందులో సిట్టింగ్ స్థానం మెదక్ నుంచి నటి విజయశాంతి పోటీ చేయనుండగా, కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి మాత్రం చేవెళ్ల నుంచి మహబూబ్ నగర్‌కు బదిలీకానున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందులో 11 మంది లోక్‌సభ, 55 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం.
అయితే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్థానాన్ని ఈసారి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మహబూబ్‌నగర్‌కు మార్చినట్లు తెలుస్తోంది. మిగిలిన పది మంది సిట్టింగ్ ఎంపీలు తమతమ స్థానాల నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఒ ఖమ్మం ఎంపీ స్థానాన్ని సీపీఐకి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి ఆమె సిట్టింగ్ స్థానమైన మెదక్‌నే కేటాయించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎంపీల్లో పది మందికి ఆయా స్థానాలను కేటాయించింది. ఖమ్మం స్థానాన్ని మాత్రం సీపీఐకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీడీపీ నేత నామా నాగేశ్వర రావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
ఇకపోతే.. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో జైపాల్ రెడ్డి (మహబూబ్‌నగర్), విజయశాంతి (మెదక్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (భువనగిరి), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), అంజన్‌కుమార్ యాదవ్ (సికింద్రాబాద్), సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), మధుయాష్కీ (నిజామాబాద్), గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్గొండ), సిరిసిల్ల రాజయ్య (వరంగల్), సురేశ్ షేట్కార్ (జహీరాబాద్) పేర్లు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, చేవెళ్ల, నాగర్ కర్నూల్ సీట్లను పెండింగ్‌లో ఉంచారు.