పదేళ్లు పాలించిన అవినీతి యూపీఏ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి, ఆ పార్టీకి ఘోరీ కడదామని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని దేశమంతా కోరుకుంటుందని మోడీ అన్నారు.
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంఘడ్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. మంచి రోజులు రాబోతున్నాయని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారణాసిలో ర్యాలీని నిర్వహించేందుకు ఈనెల 10వ తేదీన అనుమతిచ్చిన ఎన్నికల అధికారులు తన ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఇది పక్షపాతం కాదా అని ప్రశ్నించారు.
ఇకపోతే... పదేళ్ళ యూపీఏ పానలో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వానికి తీరికే లభించలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపాలని దేశమంతా కోరుకుంటోందని నరేంద్ర మోడీ అన్నారు.