నరేంద్ర మోడీ : వివాహం... భార్య వివరాలు బహిర్గతం!

గురువారం, 10 ఏప్రియల్ 2014 (16:29 IST)
File
FILE
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైవాహిక జీవితంపై చర్చ జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకే మోడీ తన పెళ్లి.. భార్య పేరు వివరాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం ఆయన తాను ఒంటరి అని అఫిడవిట్లలో పేర్కొనేవారు. కానీ ఈసారి తనకు పెళ్లి అయిందని, భార్య ఆస్తిపాస్తుల సంగతి తనకు తెలియదని అందులో రాశారు.

తాను 17 ఏళ్ల వయస్సులోనే తన వయస్సుకు సమానమైన బాలికను వివాహం చేసుకున్నట్లు మోడీ వెల్లడించారు. వడోదర లోక్‌సభ స్థానానికి బుధవారం మోడీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో మోడీ తన వివాహానికి సంబంధించిన వివరాలను ప్రస్తావించారు. తన భార్యపేరు జశోదాబెన్ అని, ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్‌గా ఉన్నారని తెలిపారు.

2001, 2002, 2007, 2012 గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ నామినేషన్ పత్రాల్లో వివాహం గురించి కాలమ్‌ను ఖాళీ ఉంచారు. కానీ, తన వైవాహిక జీవితంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే తన పెళ్లి గురించిన వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మోడీ పెళ్లి చేసుకుని భార్యతో ఎందుకు కలసి ఉండటం లేదంటూ లోగడ పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

అయితే, పెళ్లయిన రెండు వారాలకే మోడీ తన ఆశయాల కోసం భార్యతో విడిపోయినట్లు సమాచారం. ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి తన భార్య పేరిట ఉన్న ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, తన భార్య జశోదాబెన్‌కు ఉన్న ఆస్తుల వివరాలు తెలియవని మోడీ తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి