మనుషుల భావోద్వేగాలపై ఇంటి రంగుల ప్రభావం!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (16:47 IST)
File
FILE
నివశించే గృహానికి వేసే రంగులు మనుషుల ప్రవర్తన, ఆలోచన, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయని చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ చెపుతోంది. గృహానికి మనం వాడే రంగులను బట్టి శుభ, అశుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇందులో భాగంగా ఫెంగ్‌షుయ్ ప్రకారం రంగులను ఎలా వాడాలనే అంశాలను పరిశీలిస్తే... అన్ని రంగుల్లోనూ కొట్టొచ్చేలా కనిపించేది ఎరుపు. దీనిని గృహాలకు మితంగా వాడితే మంచిది. ఎరుపు రంగును పడక గదులకు పూర్తిగా ఉపయోగించకూడదు.

ఇక పసుపు రంగును మేధస్సుకు, పరిణతికి చిహ్నంగా కొలుస్తారు. ఈ రంగును వంటగది, సిటింగ్ రూమ్‌లకు వాడితే శుభఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

ఇదేవిధంగా... గోధుమ రంగు విషయానికొస్తే... ఈ రంగును ఫెంగ్‌షుయ్ స్థిరత్వానికి ప్రతీకగా పేర్కొంటారు. అందుచేత గోధుమరంగు ప్లోరింగ్‌కే పరిమితం చేయాలి.

ఇకపోతే.. బంగారు, వెండి రంగులు ధనం, సంపదను సూచిస్తాయి. అందుచేత ఈ రంగులను గృహంలోని దేవుడి గది, బంగారు ఆభరణాలు, నగదు భద్రపరచే అలమరాలకు ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అధికంగా సంచారంలేని విశాల గదులకు కూడా బంగారు, వెండి రంగులను ఉపయోగించవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అదేవిధంగా... బూడిద, తెలుపు రంగులు గృహంలో ఏ గదికైనా వాడుకోవచ్చు. నీలం, వంకాయ రంగులు విశ్రాంతికి సూచికలు. అందువల్ల బెడ్‌రూమ్, ఇతర విశ్రాంతి మందిరాల్లో కనిపించేలా వాడుకోవాలి. ఆకుపచ్చ రంగు వృద్దికి చిహ్నం. దీనిని బయటి గోడలకు ఉపయోగించుకోవచ్చు. గులాబీరంగు సిటింగ్ రూమ్‌లకు వేస్తే ఆ గృహంలో సకల సంపదలు వెల్లివిరుస్తాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

ఇదిలా ఉంటే.. నలుపు రంగు మాత్రమే జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందువల్ల దీనిని ఎవ్వరు సంచరించని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలి.

వెబ్దునియా పై చదవండి