ఉగాది రోజున పచ్చడిని తొలిజాములోనే తీసుకోవాలి: పూజ.. ఉదయం 9 గంటల్లోపే పూర్తి చేయాలి.

మంగళవారం, 28 మార్చి 2017 (16:54 IST)
ఉగాది రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటిశుభ్రం చేసుకుని ఇంటికి ముందు మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి గణపతిని, ఇష్టదేవతను పూజించాలి. సరస్వతి, బ్రహ్మలతో పాటు, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు దిక్పాలకులను, నవగ్రహాలను అర్చించుకోవాలి. ఆపై పంచాంగాన్ని పూజించి, శాస్త్రవేత్త ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి. 
 
సంవత్సర ఆరంభంలో- గ్రహ, నక్షత్ర, వారాదులు అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణ అనంతరం- ఉగాది పచ్చడిని నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి. వేపపూత, మామిడి, బెల్లం వంటి షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని చెప్తారు. ఈ ప్రసాదాన్ని మొదటి యామం (జాము)లోనే (ఉదయం 8.30-9.00 గంటల మధ్య) గ్రహించాలంటారని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
"శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ 
సర్వారిష్ట వినాశాయనింబకం దళబక్షణం"... ఈ మంత్రాన్ని ఉగాది రోజున పఠించడం ద్వారా సకలసంపదలు, సంకల్పసిద్ధి చేకూరుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు. ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది. ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది.
 
అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇంకా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినండి. అలాగే ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలగే గోచార ఫలితాలపై ఉపన్యాసాలు ఇప్పించడం మంచిది. ఇంకా ఉగాది నాడు శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి. అందుచేత శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పూజ చేసేటప్పుడు పఠించాలి.

వెబ్దునియా పై చదవండి