రెండు దశాబ్దాల తర్వాత విశ్వవిజేతగా.. నాట్యం చేసిన ఫ్రెంచ్ ప్రధాని
సోమవారం, 16 జులై 2018 (09:27 IST)
రెండు దశాబ్దాల తర్వాత ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విశ్వవిజేతగా నిలిచింది. 2018 విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్…. రెండోసారి సాకర్ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ ఆనందంలో ఫ్రెంచ్ ప్రధాని నాట్యం చేశారు.
రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీలు కప్ ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది. దశాబ్దాల కాలం నాటి రికార్డులను కొల్లగొట్టి.. కొత్త చరిత్రను మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది.
ఫలితంగా ఇప్పటివరకు రెండు సార్లకుపైగా ప్రపంచకప్ సాధించిన బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, ఉరుగ్వే, అర్జెంటీనాల సరసన నిలిచింది ఫ్రాన్స్. 1998, 2006, 2018లో మొత్తం మూడు సార్లు ఫైనల్ చేరిన ఫ్రెంచ్ జట్టు.. 1998లో మొదటిసారి కప్ కొట్టింది. 2006లో ఇటలీ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. మళ్లీ 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఫిఫా కప్‌ను ఆ జట్టు గెలుచుకుంది.
ఈ విజయంతో ఫ్రాన్స్ కోచ్ డైడర్ డెస్ ఛాంప్స్ అరుదైన ఘనత సాధించాడు. 1998లో ఫ్రాన్స్ ఛాంపియన్‌గా గెలిచినప్పుడు… డెస్ ఛాంప్స్ కెప్టెన్. నాటి టోర్నీలో జినెదిన్ జిదాన్, థియరీ హెన్రీలాంటి దిగ్గజాలతో కలిసి ఫ్రాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు డెస్ ఛాంప్స్. ఇపుడు తన సొంత టీంకు కోచ్‌గా మరోసారి జగజ్జేతగా నిలిపాడు. ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా రికార్డుల్లో నిలిచాడు డెస్ ఛాంప్స్. అంతకుముందు బ్రెజిల్ లెజెండ్ మారియో జగాలో, జర్మనీ దిగ్గజం బెకెన్ బాయర్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఇకపోతే, వరల్డ్ కప్ ఫైనల్‌లో 4 గోల్స్ కొట్టడం ఇదే రికార్డు. 1970లో బ్రెజిల్ తర్వాత మళ్లీ ఇప్పుడే 4 గోల్స్ కొట్టిన తొలి టీంగా ఫ్రాన్స్ రికార్డు సృష్టించింది. అటూ 2002 నుంచి జరిగిన మొత్తం నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచుల్లో మొత్తం 6 గోల్స్ మాత్రమే కొడితే.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే 6 గోల్స్ వచ్చాయి. 1958 ఫైనల్ తర్వాత ఒకే మ్యాచ్‌లో 6 గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యధికంగా 6 గోల్స్ చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీకేన్‌కు గోల్డెన్ బూట్ దక్కింది. ఉత్తమ ఆటగాడిగా క్రొయేషియా ప్లేయర్ లూకా మోద్రిచ్‌కు గోల్డెన్ బాల్, ఉత్తమ గోల్ కీపర్‌గా బెల్జియం ప్లేయర్ కోర్ట్ వాకు గోల్డెన్ గ్లోవ్, న్యాయంగా ఆడిన జట్టుగా స్పెయిన్‌కు ఫెయిర్ ప్లే, బెస్ట్ ప్లేయర్‌గా ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపెకు యంగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నారు.
నెల రోజుల పాటు ఉర్రుతలూగించిన ఫిఫా ప్రపంచ కప్ 2022లో ఖతార్ వేదికగా మెగా టోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి… ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ ఫాంటినో సమక్షంలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థనీకి 2022 ప్రపంచ కప్ టార్చ్‌ను అందించారు. రష్యాలో సక్సెస్‌గా జరిగినట్లుగా.. ఆదేశంలోనూ సక్సెస్‌గా జరగాలని పుతిన్ కోరుకున్నారు. ప్రపంచ కప్ టోర్నీకి అథిత్యమిస్తున్న తొలి అరబ్ దేశంగా ఖతార్ రికార్డుల్లోకెక్కింది.