ఫిఫా వరల్డ్ కప్ : ఉరుగ్వే చిత్తు.. సెమీస్‌లో ఫ్రాన్స్

శనివారం, 7 జులై 2018 (11:35 IST)
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ సాకర్ ఫుట్‌బాల్ పోటీల్లో ఫ్రాన్స్ జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. ప్రత్యర్థి ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు అదరగొట్టింది. ఫలితంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ పోటీలో ఉరుగ్వే జట్టుపై 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది.
 
అందరి అంచనాలు నిజం చేస్తూ, ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ క్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేను అద్భుతంగా నిలువరించింది. స్టార్ ఫార్వర్డ్ లూయిస్ సురెజ్‌ను కచ్చితమైన మార్కింతో కట్టడి చేసిన ఫ్రాన్స్ జట్టు విజయాన్నందుకోగా.. కవానీ గాయంతో అందుబాటులో లేకపోవడంతో ఎదురుదాడి చేయడంలో వెనుకబడిన ఉరుగ్వే జట్టు ఓటమి పాలైంది. 
 
అర్జెంటీనాపై రెండు వరుస గోల్స్‌లో సంచలనం సృష్టించిన యువ ఫార్వర్డ్ ఎంబాప్పేను ఉరుగ్వే మార్కింగ్ చేసినా.. గ్రిజ్‌మన్ జోరును అడ్డుకోలేక పోయింది. మ్యాచ్ తొలి అర్థభాగం 41 వ నిమిషంలో ఫ్రాన్స్ డిఫెండర్ రాఫెల్ వారనే గోల్ కొట్టి 1-0 ఆధిక్యాన్నివ్వగా.. మ్యాచ్ 61వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ గ్రిజ్‌మన్ కళ్లు చెదిరే గోల్‌తో జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.  
 
దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం మరింత పెరిగింది. గ్రిజ్‌మన్ కొట్టిన షాట్ ఉరుగ్వే గోల్‌కీపర్ చేతుల్లోకి వెళుతున్నట్లు కనిపించినా గోల్‌పోస్టు సమీపంలో బంతి అనూహ్యంగా స్పిన్ కావడంతో ఉరుగ్వే గోల్‌కీపర్ ముస్‌లెరా తడబడ్డాడు. ఈ ఓటమితో ఉరుగ్వే స్టార్ డిఫెండర్, కెప్టెన్ గోడిన్ ప్రపంచకప్ విజేతగా నిలువకుండానే దాదాపు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినట్లే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు