దూసుకుపోతున్న ఆహారద్రవ్యోల్బణం: పాలు, మాంసం ప్రియం

గురువారం, 3 నవంబరు 2011 (15:57 IST)
FILE
భారతదేశ ఆహారద్రవ్యోల్బణం రాకెట్‌లా దూసుకపోతోంది. తొమ్మిది నెలల గరిష్టస్థాయికి ఎగబాకింది. దీంతో కూరగాయలు, పాలు, మాంసాహార ధరలు ఆకాశన్నంటనున్నాయి.

భారతదేశం అసలు సిసలైన ముప్పును ఎదుర్కొనబోతోందనీ, ఆహారద్రవ్యోల్బణం భారత్ నడ్డి విరవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు ఎన్నిసార్లు రెపో రేట్లను పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

ఆహారద్రవ్యోల్బణం ప్రభావం మెల్లగా స్టాక్ మార్కెట్, రూపాయి విలువపైనా చూపుతోంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 0.8 శాతం మేర పడిపోగా రూపాయి 0.3 శాతం మేర పతనమైంది. ఇక పప్పు, కాయ ధాన్యాల ఉత్పత్తులు తరిగిపోవడంతో దాని ప్రభావం పాలు, గుడ్లు, మాంసాహారాలపై పడింది. దీంతో ఆహారద్రవ్యోల్బణం అదుపుతప్పి ముందుకు దూసుకెళుతోంది. ఫలితంగా ఆర్బీఐ 2010 నుంచి ఇప్పటివరకూ రెపో రేట్లను 13సార్లు పెంచింది.

అక్టోబరు వారాంతానికి ఆహారద్రవ్యోల్బణం అనూహ్య రీతిలో పెరిగింది. దీంతో కూరగాయల ధరలు ఎకాఎకిన 28.9 శాతం మేర పెరిగాయి. పాల ధరలు 11.7 శాతం పెరిగితే గుడ్లు, మాంసం, చేపల ధరలు ఒక్కసారిగా 13.4 శాతం మేర ఎగబాకాయి. ఆహారద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోతే సగటుజీవి బతుకు దుర్భరంగా మారడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు.

వెబ్దునియా పై చదవండి