కన్యారాశి జాతకులైతే.. జాతిపచ్చను ధరించండి

మీరు కన్యారాశిలో పుట్టినవారైతే తప్పకుండా నవరత్నాలలో జాతిపచ్చను ధరించడం శ్రేయస్కరమని రత్నాలశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రాశికి అధిపతి బుధగ్రహం కావడంతో... ఈ జాతకులు శ్రమజీవులు, బుద్ధిమంతులు, విద్యావంతులుగానూ ఉంటారు.

ఆంగ్లంలో జాతిపచ్చను ఫిరోజ్, ఎమరాల్డ్, ఆర్నిక్స్ అని పిలుస్తారు. తెలుగులో హరితమణి, మరకతము అని పిలువబడే ఈ జాతిపచ్చను కన్యారాశి జాతకులు ధరిస్తే బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది. ఎమరాల్డ్‌ రత్నధారణతో కామ, క్రోధ వికారాలు నశించి, శాంతి, సుఖాలు కలుగుతాయని విశ్వాసం.

జాతిపచ్చలతో చెవులకు పోగులు, రింగులు, మెడలో నెక్లెస్‌లు వంటివి మహిళలు ధరిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని రత్నాలశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా పురుషులు జాతిపచ్చను బంగారంతో పొదిగించి ధరిస్తే వ్యాపారాభివృద్ధి, శరీర బలాన్ని పెంచుతుంది.

ఎలా ధరించాలంటే...?
బుధవారం సూర్యోదయానికి జాతిపచ్చను ధరించాలి. కుడిచేతి చిటికెన వ్రేలుకు ధరించడం మంచిది. ముందుగా పాలతో గానీ గంగాజలముతో గానీ శుద్ధి చేసి, అనంతరం జాతిపచ్చ రత్నాన్ని బంగారంతో పొదిగించి ధరించడం శ్రేయస్కరం. ఈ రత్నాన్ని ధరించే ముందు 170 సార్లు బుధ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా ఆత్మశాంతి, సుఖసంతోషాలు చేకూరుతాయని రత్నాలశాస్త్రం చెబుతోంది.

జాతిపచ్చను కనుగొనడం ఎలా..?
జాతిపచ్చను నీటిలో ఉంచితే అలాగే ఉంటుంది. కిందపడిన వెంటనే పగిలిపోతుంది. కర్రపై రుద్దితే కాంతి పెరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి