ద్వాదశ మేష, వృషభలగ్నంలో జన్మించిన జాతకులు పగడము, కెంపు, వజ్రము, నీలము, జాతిపచ్చ వంటి నవరత్నాలను ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. వీటిని ధరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు.
ముందుగా మీరు మేషలగ్నంలో పుట్టిన వారైతే పగడమును ధరించడం మంచిది. పగడమును ధరించడం ద్వారా ఆయుష్షు, ఆరోగ్యవృద్ధి, వ్యాపారాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయి. అలాగే కెంపు రత్నాన్ని మేషలగ్నములో పుట్టిన వారు ధరిస్తే సంతానప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవం వంటివి లభిస్తాయి. ఇంకా కనకపుష్యరాగమును మేష లగ్నకారులు ధరించడం ద్వారా అదృష్టం, కుటుంబానికి లాభం చేకూరుతుంది.
ఇకపోతే.. వృషభలగ్నములో జన్మించిన జాతకులు వజ్రము, నీలము, జాతిపచ్చ వంటి రత్నాలను ఉపయోగించడం ద్వారా భోగభాగ్యాలు చేకూరుతాయని రత్నాల శాస్త నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా వృషభలగ్నములో జన్మించిన జాతకులు వజ్రమును ధరించడం ద్వారా రుణభారము నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా శత్రు బాధలు తగ్గిపోయి, ధనలాభము పెరుగుతుంది.
ఇదిలా ఉంటే.. వృషభలగ్నములో పుట్టిన జాతకులు నీలపు రత్నాన్ని ధరించడం ద్వారా శారీరక తేజస్సుతో పాటు ముఖవర్చస్సు పెరుగుతుంది. ఇంకా వృషభ లగ్నకారులు నీలపు రత్నాన్ని ధరించడంతో అదృష్టము వీరి వెన్నంటి ఉంటుంది. ఉద్యోగము, బదిలీ, ఉన్నత పదవులను అలకరించడం చేస్తారు.
మరోవైపు జాతిపచ్చను ధరించడం ద్వారా కూడా వృషభలగ్నకారులు విద్యాభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతిభతో రాణించి పరీక్షల్లో విజయం, ధనలాభము కలుగుతుందని రత్నాల శాస్త్రం చెబుతోంది.