రోగాలు, పాపాలను హరించే తులసీ మాల..!?

గురువారం, 27 జనవరి 2011 (18:20 IST)
FILE
దేవదేవులకు ప్రీతికరమైనది తులసీ పత్రం. తులసితో చేసే పూజ అశ్వమేధ యాగ ఫలాన్ని ఇస్తుంది. తులసి మొక్కకు, తులసి ఆకుకు ఎంతటి విశిష్టత ఉన్నదో, అందుకు ఏమాత్రం తగ్గని విశిష్టత తులసి పూసల హారానికి ఉన్నదని పండితులు అంటున్నారు. తులసీతో తయారయ్యే తులసీ మాలను ధరించడం ద్వారా రోగాలు, పాపాలు హరింపబడుతాయి.

తులసి హారం ధరించిన వారిలో మనోనిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్త్వికగుణాలుంటాయి. ఈ తులసీహారం ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది. స్పటికమాల, పగడాల మాలకంటే ఉన్నత ఫలితాలను తులసీమాల ఇస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది.

అందుచేత తులసీ మాల శ్రీమన్నారాయణునకు సమర్పించుకుని, పూజదికాలు చేయించుకుని లేదా ఇంట్లోనే చేసుకుని ఆ మాలను ధరించే వారు పరమభాగవోత్తములు అవుతారట. ఈ మాల ధరించినవారికి దుశ్శకునములు, దుస్వప్నాల దుష్ఫలితాలు దరికి చేరవు. ఇంకా ఈ జన్మలో చేసిన పాపాలే గాక గత జన్మలో చేసిన పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయి. శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ అనుగ్రహంతో విష్ణుసాయుజ్యం కలుగుతుంది.

తులసి పూసల హారం ఎవరు ధరిస్తారో వారికి అంటు, అశౌచం అంటదని, అందుకే దాంపత్య సమయంలో సైతం తులసీహారాన్ని తీయకూడదు. ఈ హారాన్ని ధరించడం ద్వారా పాండిత్యం, సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. అప్రతిష్టలన్నీ తొలగిపోయి, సిరిసంపదలు, సౌభాగ్యం కలుగుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి