జోతిష్యంలో గ్రహాల సంచారాన్ని బట్టి మానవుని గ్రహ ఫలాలు పరిణమిస్తుంటాయి. గ్రహాల సంచార ఫలాలతో పాటు నవరత్నాల ధారణతో కూడా నష్టాలను తొలగించవచ్చునని జ్యోతిష్కులు అంటున్నారు.
అలాగే.. తమ అదృష్టం మరింత పెంచుకునేందుకు నవరత్న ఉంగరాలను, వజ్ర వైఢూర్యాలను హారాలుగా చేసుకుని ధరిస్తే కొన్ని అశుభాలు దరిచేరవని వారు చెబుతున్నారు. ఈ నవరత్న ఉంగరాలను ఎలాంటి వ్యక్తులు ధరించాలో తెలుసుకుందాం.
వజ్రపుటుంగరాన్ని రాజకీయవేత్తలు, ఆకర్షణా లోపము గలవారు, స్త్రీలోలురు ధరించాలి. అలాగే.. చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు వజ్రమును గాని పగడమును గానీ ధరించినట్టయితే వ్యాధి కొంత మేరకు నయం అవుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతోంది.
అలాగే నీలం రాయి కలిగిన ఉంగరాన్ని ఈతిబాధలు, దారిద్ర్యముతో కష్టాలనుభవిస్తున్నవారు, కీళ్ళ నొప్పులు కలవారు, కుసుమ వ్యాధులు కలిగిన వారు ధరించాలి. వైఢూర్యానికి విష జంతు బాధా నివారణము అనే పేరుకూడా ఉంది. ప్రతివాద భయము తొలగుటకు, సంతానలోప నివారణకు దీనిని ఉపయోగించపచ్చు.
ఇకపోతే... గోమేధికమును నరాల సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ధరించవచ్చు. వ్యాపారములందు రాణించి, లాభాలను పొందలేని వారు గోమేధికమును ధరిస్తే మంచి ఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే పుష్యరాగ ఉంగరాన్ని దేవభక్తి, సూక్ష్మజ్ఞానము పొందాలనుకునేవారు ధరించవచ్చు.
పగడమును రాజకీయ వేత్తలు, శత్రుభయంతో బాధపడుతున్నావారు, దీర్ఘవ్యాధి గలవారు ఈ ఉంగరాన్ని ధరించడం మంచిది. అలాగే ముత్యమును అన్ని సమయాలందు, ప్రతి ఒక్కరు ధరించవచ్చును. కుటుంబ సౌఖ్యములేని వారు సోమవారము రోజున ముత్యముతో కూడిన ఉంగరాన్ని ధరిస్తే మంచిదని రత్నాల శాస్త్రం పేర్కొంటోంది.