ఇలా జరుగుతుందని తెలిస్తే.. బాంబు వేసేవాడిని కాదు...!!
FILE
విశ్వ మానవాళిని క్షణాల్లో బూడిద చేయగల అమోఘ శక్తి అణుబాంబు. ఈ అణువు ఎంత ప్రమాదకరమో తొలిసారిగా ప్రపంచం గుర్తించిన రోజు 1945 ఆగస్టు 6. రెండో ప్రపంచయుద్ధ కాలంలో అమెరికా అధ్యక్షుడు ఎస్. ట్రూమన్ ఆదేశాల మేరకు.. జపాన్ చారిత్రక పట్టణాలలో ఒకటైన హిరోషిమా నగరంపై ఈ అణుబాంబును జారవిడిచారు.
"లిటిల్ బాయ్" అని పిలిచే ఈ అణుబాంబును జపాన్‌లోని "హిరోషిమా" నగరంపై జారవిడిచారు. అంతే, క్షణంలో వేలాదిమంది మాడి మసై పోగా.. నగరం భస్మీపటలమైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణుబాంబు దాడికి గురైన నగరంగా చరిత్రలో మిగిలిపోయింది. ఈ బీభత్సాన్ని కళ్లారా చూసిన ఆ యుద్ధ విమానం కెప్టెన్ పాల్ టిబ్బెట్ భయంతో కంపిస్తూ, పాపభీతితో చలించిపోయాడు. ఇంత దారుణం జరుగుతుందని తెలిస్తే అసలు ఆ బాంబును వేసేవాడినే కాదని వికలం చెందాడు, నిలువెల్లా వణికిపోయాడు.
అయితేనేం ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేని అమెరికాకు కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. మరో మూడు రోజుల తరువాత ఆగస్టు 9న జపాన్ మరో నగరమైన "నాగసాకి"పై "ఫ్యాట్ మ్యాన్" అని పిలిచే మరో అణుబాంబును జారవిడిచింది. ఇలా ట్రూమన్ ఆదేశాల మేర జరిగిన ఈ మారణకాండలో హిరోషిమా, నాగసాకి నగరాలలో మొత్తం రెండు లక్షల 20 వేల మంది ప్రజలు అసువులుబాసారు.
మరిచిపోలేని ఓ పీడకల...!!
బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థలను కలిగి ఉన్న హిరోషిమా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్య ప్రధాన స్థావరంగా ఉండేది. సైన్యానికి సరఫరా చేసే పలు ఆయుధ డిపోలు ఈ నగరం సొంతం. అందుకే దీనిపై అమెరికా కన్నుపడింది. అంతే వెంటనే అణు మారణహోమానికి పాల్ప...
అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే హిరోషిమా నగరంలో 70 వేల మందికి పైగా మరణించగా... అణుధూళి వల్ల మరో 90 వేల నుంచి లక్షా 40 వేల మంది మరణించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. నాటి దాడికి హిరోషిమాలోని భవనాల్లో సుమారు 69 శాతం నేలమట్టమయ్యాయి. అంతేకాదు 1942లో 4,19,182గా ఉన్న నగర జనాభా అణు దాడితో 1,37,197కు చేరిందంటే దాడి ప్రభావం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. 1955 నాటికి పూర్తిగా కోలుకున్న ఈ నగరం, ఆ తరువాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.
హిరోషిమా నగరాన్ని 1589లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో ఈ నగరం మరెందరో రాజుల వశమైంది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థను కలిగి ఉండటం దీని సొంతం. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధాన స్థావరం హిరోషిమా నగరం కావడం విశేషం. సైన్యానికి సరఫరా చేసే అనేక ఆయుధ డిపోలు ఈ నగరంలో ఉండేవి. అందుకే ఈ నగరంపై అమెరికా కన్నుపడి, అణుబాంబు ఉత్పాతానికి దారితీసింది. మానవ చరిత్రలో మరిచి పోలేని ఓ పీడ కలగా మిగిలి పొయింది.
ఇదిలా ఉంటే... రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక్క అమెరికా వద్ద మాత్రమే అణుబాంబులు ఉండేవి. అయితే ప్రస్తుతం చాలా దేశాల వద్ద అణుబాంబులు సంగతి.. మరీ ముఖ్యంగా చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాల వద్ద వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్న సంగతి ప్రపంచానికి తెలిసిందే.. ఈ నేపథ్యంలో విశ్వ మానవాళి తమ పక్కలో అణుబాంబులు పెట్టుకుని జీవిస్తోందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఓవైపు పేట్రేగిపోతున్న ఉగ్రవాదం నీడలో మానవాళి బిక్కు బిక్కుమని కాలం గడుపుతుంటే... అణురహిత సమాజం కోసం కృషి చేయాల్సిన ఆయా దేశాలు, ముఖ్యంగా అగ్ర రాజ్యాలు, ఆధిపత్యం కోసం తాపత్రయపడుతున్నాయి. అంతేగానీ, అణువును అభివృద్ధికి వినియోగించేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. ఇప్పటికైనా ఆయా దేశాలు, నేతలు కళ్లు తెరిచి అణువును కేవలం అభివృద్ధికే వినియోగిస్తేనే హిరోషిమా, నాగసాకి మృతులకు నిజంగా నివాళులు అర్పించినట్లు అవుతుంది.