ఒక్కసారి కుదురుకుంటే.. "మహా జిడ్డు" బాబోయ్...!!

క్రికెట్ చరిత్రలో సునీల్ గవాస్కర్‌ది ఓ ప్రత్యేకమైన స్థానం. ఆల్‌టైమ్ ఓపెనర్‌గా, మహా జిడ్డుగా ముద్ర వేసుకున్న ఈయనను క్రీడాభిమానులంతా "సన్నీ" అని ప్రేమగా పిల్చుకుంటుంటారు. ఇన్నింగ్స్ ఓపెనింగ్‌లో సంపూర్ణ విజయాన్ని నమోదు చేసుకున్న గవాస్కర్‌ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడంటే ఇక అవుట్ చేయడం అనేది ప్రత్యర్థి బౌలర్లకు కష్టసాధ్యమైన పనే. ఫ్రంట్, బ్యాక్ ఫుట్ షాట్లతో అలరించే సన్నీ.. బంతి గమనాన్ని అంచనా వేయడం మహా దిట్ట.

"లిటిల్ మాస్టర్"గా కూడా పిలువబడుతూ భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా తన అపూర్వ సేవలను అందించిన సునీల్ గవాస్కర్ జన్మదినం నేడే..! సునీల్ మనోహర్ గవాస్కర్ 1949 జూలై 10వ తేదీన ముంబయిలో జన్మించాడు. తన హాయాంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఈయన ప్రపంచ రికార్డును సృష్టించాడు. అయితే 2005 డిసెంబర్‌లో మన దేశానికే చెందిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును అధిగమించాడు.

అలాగే 125 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 10,122 పరుగులను సంపాదించిన సన్నీ... అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కూడా ప్రపంచ రికార్డును సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలెన్ బోర్డర్ ఈ రికార్డును అధిగమించినప్పటికీ... టెస్ట్ క్రికెట్‌లో పదివేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్‌గా గవాస్కర్ రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది.

తొలిసారిగా వెస్టిండీస్ పర్యటనలో ఒకే సిరీస్ 774 పరుగులు చేసినప్పటి నుంచి... చివరగా పాకిస్తాన్‌తో జరిగిన బెంగళూరు టెస్టులో 96 పరుగులు చేసే దాకా గవాస్కర్ క్రీడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిరోహించాడు. బ్యాట్స్‌మెన్లను గడగడలాడించే అరివీర భయకరులైన బౌలర్లను సైతం ఈయన అలవోకగా ఎదుర్కొంటూ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు.

సన్నీ తన... సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ క్రీడా జీవితంలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు సాధించటం అన్నది అంత సామాన్యమైన విషయమేమీ కాదు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిల్చిన వెస్టిండీస్‌పైనే సెంచరీలకు సెంచరీలే సాధించి 65.45 సగటు పరుగులు సాధించటం ఆయన పోరాట పటిమకు నిదర్శనం.

టీం ఇండియా సారథిగా అంతగా విజయం సాధించలేకపోయినప్పటికీ... ఒక క్రీడాకారుడిగా సునీల్ గవాస్కర్ విజయాలు అమోఘమైనవి. ఎందరో మేటి బౌలర్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు మరపురాని అపురూప విజయాలను అందించిన సన్నీ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లభించటం భారత జట్టుకు ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు.

అనంతరం కపిల్‌దేవ్‌కు, ఈయనకు మధ్య నాయకత్వ పోటీ ఏర్పడే సమయంలో టెస్ట్ జట్టు నుంచి సన్నీ నిష్క్రమించాడు. ఆ తరువాత 1983లో ప్రపంచకప్ సాధించిన టీం ఇండియాలో సభ్యుడిగానే కాకుండా, 1984లో ఆసియా కప్ గెల్చిన భారత జట్టుకు ఈయన నాయకత్వం వహించాడు. ఆపై 1987లో ఇంగ్లండ్ జట్టుతో ముంబైలో జరిగిన వన్డే మ్యాచ్‌తో సన్నీ తన వన్డే కెరీర్‌కు కూడా స్వస్తి పలికారు.

సన్నీకి లభించిన అవార్డులు రివార్డులు కూడా చెప్పుకోదగ్గవి. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు పొందిన లిటిల్ మాస్టర్.. 1994లో ముంబాయి నగర షరాఫ్‌గా కూడా నియమించబడ్డాడు. ఈయన పేరు మీదుగా భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ విజేతకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రధానం చేయబడుతుంది. క్రికెట్ కామెంటరీ వ్యాఖ్యాతగా మరియు పలు పత్రికలకు కాలమ్స్ వ్రాయటంలోనూ సన్నీకి మంచి గుర్తింపు లభించింది.

వెబ్దునియా పై చదవండి