"నాకు నచ్చనిదాన్ని ధ్వంసం చెయ్యడమే నా ప్రవృత్తి" అంటూ జాత్యహంకారంతో మహా మారణహోమం సృష్టించిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. నరనరాన జాత్యహంకారం జీర్ణించుకుపోయిన ఈ వ్యక్తి ప్రపంచాన్నే గడగడలాడించాడు. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (నాజీ) వ్యవస్థాపకుడైన ఈయన, 1933 నుంచి జర్మనీ ఛాన్స్‌లర్‌గానూ, 1934 నుంచి మరణించేదాకా జర్మనీ నేత (ఫ్యూరర్)గానూ పనిచేశాడు.
హిట్లర్ తన వ్యక్తిగత మానిఫెస్టో (ఆత్మకథ) అయిన "మెయిన్ క్యాంప్"ను ప్రచురించిన రోజుగా చరిత్రలో జూలై 18వ తేదీకి ఒక ప్రాముఖ్యత కలదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 60 లక్షల మంది యూదు ప్రజల ప్రాణాలను హరించి, చరిత్రలో ఈ జాత్యహంకారి గావించిన మానవ హననం (హోలోకాస్ట్) అంతా ఇంతా కాదు. ఇంతటి దారుణాలకు ఒడిగట్టి, కరడుగట్టిన నియంతృత్వ విధానాలను అనుసరించిన హిట్లర్ గురించి ఈ సందర్భంగా కాస్తంత తెలుసుకుందాం...!
అడాల్ఫ్ హిట్లర్ ఆస్ట్రియా దేశంలోని బ్రౌనౌ అం ఇన్ అనే గ్రామంలో 1889, ఏఫ్రిల్ 20వ తేదీన జన్మించాడు. ఈ గ్రామం ఎగువ ఆస్ట్రియా, జర్మనీ దేశాల సరిహ్దద్దుల్లో ఉంటుంది. ఆరుగురు పిల్లల్లో నాలుగోవాడైన హిట్లర్ తండ్రి పేరు అలో ఇస్ హిట్లర్, తల్లిపేరు క్లారా పోల్జ్.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ దేశం ఆర్థికంగా, సైనికంగా భారీగా నష్టపోయింది. ఈ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడే హిట్లర్. ఈ యుద్ధం తరువాత జర్మనీపై మిత్రరాజ్యాలు విధించిన ఆంక్షలు ఆయనలోని అతివాదిని తట్టిలేపాయి. ఆ విపత్కర పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకున్న హిట్లర్... అణగారిన మధ్యతరగతి ప్రజలను తన వాక్చాతుర్యంతో ఉత్తేజితుల్ని చేశాడు.
ఈ క్రమంలో జర్మనీ పతనానికి యూదులే కారకులని జర్మన్ ప్రజలలో నూరిపోశాడు హిట్లర్. అతని ఉపన్యాసాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సోషలిస్ట్ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించేవి. అలా అధికారంలోకి వచ్చిన తరువాత పతనమైన ఆర్థిక వ్యవస్థను, నిస్తేజంగా ఉన్న సైనిక వ్యవస్థను కూడా ఈయన గాడిలో పెట్టాడు.
హిట్లర్ అనుసరించిన విదేశాంగ విధానం కూడా నియంతృత్వం, ఫాసిస్ట్ ధోరణితోనూ నిండి ఉండేది. ఈయన విదేశాంగ విధానం జర్మనీ సరిహద్దుల్ని పెంచటమే లక్ష్యంగా ఉండేది. ఇదే ధోరణితో ఇతడు ఆస్ట్రియా, పోలండ్, చెక్ రిపబ్లిక్ దేశాలపై దండెత్తాడు. ఇతగాడి ఈ దుందుడుకు చర్యయే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యింది.
రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో అక్ష రాజ్యాలు దాదాపు యూరప్‌ను జయించాయి. కానీ క్రమంగా మిత్ర రాజ్యాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ జాతి వ్యతిరేక విధానాల వలన యుద్ధం పూర్తయ్యేసరికి సుమారుగా 1.1 కోట్ల ప్రజలు మరణించారు. వీరిలో 60 లక్షల మంది యూదులు. దీనిని చరిత్రలో మానవ హననం (హోలోకాస్ట్)గా పేర్కొంటారు.
యుద్ధపు చివరి రోజులలో సోవియట్ రష్యాకు చెందిన "రెడ్ ఆర్మీ (ఎర్ర సైన్యం)" బెర్లిన్ నగరంలోనికి ప్రవేశించగానే హిట్లర్ ఆ ముందురోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్‌తో కలిసి ఒక నేలమాళిగలో ఏప్రిల్ 30, 1945 మధ్యాహ్నం 3.30కి ఆత్మ హత్య చేసుకొన్నాడు.
అయితే... అప్పటి వరకూ ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్‌కూ, అతడి భార్యకూ డూప్‌లు ఉండేవారని... ఈ డూప్‌లే ఆత్మహత్య చేసుకున్నారనీ, నిజమైన హిట్లర్ ఆయన భార్య ప్రాణాలతో తప్పించుకుపోయారని పెద్ద ఎత్తున వదంతులు ప్రచారం అయ్యాయి. ఈ సంచలనాత్మక వార్తలతో కొన్నిరోజులపాటు వార్తా సంస్థలూ, పత్రికలు కూడా ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని చేసుకున్నాయి. అయితే ఆ తరువాత నిజమైన హిట్లర్ దంపతులే ఆత్మహత్య చేసుకుని మరణించారన్న వాస్తవం ఈ ప్రపంచానికి వెల్లడైంది.