"తోకచుక్కలు" వాటి కథా, కమామీషు..!!

మంగళవారం, 6 జనవరి 2009 (14:57 IST)
పిల్లలూ...! నక్షత్రాలను చుక్కలంటారని తెలుసు కదూ...! కానీ తోకచుక్కలు మాత్రం నిజం చుక్కలు కావు. తోకచుక్కలనేవి సౌర కుటుంబానికి చెందినవి. తోకచుక్కలను ఇంగ్లీషులో కామెట్‌లు అని కూడా అంటారు. ఇప్పటిదాకా దాదాపు 600 తోకచుక్కలను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

తోకచుక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే... తన కక్ష్యలో సూర్యునికి దూరాన ఉన్నప్పుడు అతిశీతలంగా ఉంటుంది. దానిలోని వాయువులు గడ్డకడతాయి. అప్పుడు దానికి తలేకాని తోక ఉండదు. తోకచుక్క తలలో మిథేన్, అమ్మోనియా, నీరు గడ్డకట్టి ఉంటాయి.

ఈ గడ్డలోపల ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం మొదలగు మూలకాలు ఉంటాయి. సూర్యుని సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని మంచు కరిగిపోతుంది. వాయువులు విడిపోతాయి. ఈ వాయుకణాల మీద, ఉల్కాధూళి కణాలమీద సూర్యకాంతి పడి ప్రతిఫలిస్తుంది. ఇదే తోకలాగా ప్రకాశిస్తుంది. ఈ వాయువులను సౌరవాయువులు వెనక్కి త్రోసివేస్తాయి. ఈ కారణం వల్లనే ఎప్పుడూ తోకచుక్క తల సూర్యునివైపు, తోక సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటాయి.

మనకు సాధారణంగా తోకచుక్కలు కనిపించవు. భూమికి బాగా దగ్గరకు వస్తే, కొన్నిసార్లు కనిపించవచ్చు. హేలీ అనే తోకచుక్క ప్రతి 77 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. కొన్ని ఏడు సంవత్సరాలకు ఒకసారి ప్రదక్షిణం చేస్తే, ఇంకొన్ని మిలియన్ సంవత్సరాలకోసారి ప్రదక్షిణం చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి