ఈ వివరాలను పరిశీలిస్తే, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్ నగర్, నడిగడ్డ తండా ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం స్థానికంగా కల్లు సేవించారు. ఆ రోజు వారికి ఎలాంటి అనారోగ్యం కలగలేదు. సోమవారం ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరిగా అనారోగ్య లక్షణాలు బయటపడ్డాయి. బీపీ పడిపోవడం, తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కొందరిలో స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితులను హైదర్‌గూడలోని రాందేవ్ ఆసుపత్రికి తరలించారు.
బాధితులకు ఆదివారం నుంచి మూత్రం సరిగా రావడం లేదని, దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు గుర్తించారు. రక్తంలో క్రియాటినైన్ స్థాయులు ప్రమాదకరంగా పెరగడంతో మెరుగైన చికిత్స కోసం, డయాలసిస్ నిర్వహించేందుకు వీలుగా వారందరినీ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో అడ్డగుట్టకు చెందిన ఓదేలు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఉమ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడంతో అబ్కారీ అధికారులు మంగళవారం సాయంత్రం హైదర్ నగర్, ఆల్వినాకాలనీ, శంషీగూడలోని మూడు కల్లు దుకాణాలను హడావుడిగా సీజ్ చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.