ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు దివంగత సిరిమావో బండారునాయకే. శ్రీలంక ఫ్రీడం పార్టీ తరపున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఈమె... శ్రీలంక దేశానికి 7వ, 9వ, 15వ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. అలా ఆమె మొదటిసారి జూలై 21, 1960న మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజుగా జూలై 21కి ప్రాముఖ్యాన్ని సంతరించి పెట్టారు.
సిరిమావో జీవిత విశేషాలను చూస్తే.... 1916 ఏఫ్రిల్ 17వ తేదీన ఓ బౌద్ధ కుటుంబంలో సిరిమావో రతవాతే దియాస్ బండారునాయకే జన్మించారు. లంక రాజధాని కొలంబోలోని సెయింట్ బ్రిగేడ్స్ కాన్వెంట్‌లో విద్యనభ్యసించారు. ఆ తరువాత యుక్తవయస్సు వచ్చాక ఆమెకు దియస్ బండారునాయకేతో 1940వ సంవత్సరంలో వివాహం జరిగింది.
బండారునాయకే శ్రీలంక ఫ్రీడం పార్టీకి 40 సంవత్సరాల పాటు తన అవిరళ కృషి జరిపారు. 1955 ప్రాంతంలో అప్పటి విపక్ష నేతగా ఆయన సింహళ భాషను అధికార భాషగా గుర్తించాలని... తాను గనుక అధికారంలోకి వస్తే, 24 గంటల్లోనే సింహళాన్ని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఆదేశాలిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
అన్నట్లుగానే బండారునాయకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించటం, సింహళాన్ని అధికార భాషగా గుర్తించటం జరిగిపోయాయి. దాంతో తమిళ-సింహళ తెగల మధ్య ఘర్షణలు చెలరేగి 150 మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి తీవ్రను గమనించిన ఆయన కొద్దిపాటి సడలింపులు విధించినా.. ఆ తరువాత అనేక ఘర్షణలు జరిగి వందలాది తమిళులు మరణించారు. ఆ తరువాత 1959 సెప్టెంబర్ 25న బండారునాయకే ఒక బౌద్ధ సన్యాసి చేతిలో హత్యకు గురయ్యారు.
అలాంటి పరిస్థితుల్లో బండారునాయకే జీవన సహచరి సిరిమావో బండారునాయకే 1960 జులై 21వ తేదీన శ్రీలంక ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. లంక సెనేట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె తన పరిపాలనా కాలంలో ఆమె వివిధ రంగాలను జాతీయీకరణ చేస్తూనే దేశాభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారు.
సిరిమావో పరిపాలన కాలంలో చేపట్టిన సంస్కరణల కారణంగా అనేక దేశాలకు శ్రీలంక దగ్గరైంది. పాలనా కాలంలో ఈమె సింహళ భాషను శ్రీలంక జాతీయ భాషగా చేశారు. అయితే ఆమె చేపట్టిన ఈ చర్య అక్కడ నివాసం ఉంటున్న తమిళులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో 1965లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ పరాజయం పాలై అధికారం నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో శ్రీలంకలో కొత్త రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది.
తదనంతరం 1970లో జరిగిన ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన సిరిమావో... ప్రధానమంత్రిగా బాధ్యతలు మరోసారి చేపట్టారు. అప్పటివరకూ సిలోన్‌గా పిలిచిన లంకను శ్రీలంకగా నామకరణం చేశారు. దేశంలో అప్పుడే వేళ్లూనుకుంటున్న వేర్పాటువాదాన్ని భారత, పాకిస్థాన్ దళాల సాయంతో సిరిమావో అణచివేశారు.
ఆ తరువాత 1977వ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిరిమావో నేతృత్వం వహిస్తున్న శ్రీలంక ఫ్రీడం పార్టీ పరాజయం పాలైంది. ఆ తరువాత మళ్లీ 1944లో అధికారంలోకి వచ్చిన ఈమె ఆగస్టు 10, 2000 సంవత్సరం దాకా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఇదే సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన గుండెపోటు కారణంగా సిరిమావో బండారు నాయకే తుదిశ్వాస విడిచారు.