పిల్లలూ...! మన శరీరంలో రక్తంతో సహా, ప్రతి అవయవంలోనూ ఏదో ఒక రూపంలో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఈ నీటి పరిమాణంలో కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తే ఫర్వాలేదుగానీ... పరిమితికి మింతి ఒంట్లో నీటి శాతం తగ్గిపోతే, ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది.
సాధారణంగా మన శరీరం బరువులో 12 శాతం బరువుకి సమానమైన నీటిని శరీరం కోల్పోయినట్లయితే... ఆరోగ్యం విషమిస్తుంది. అలాంటి సమయాలలో రక్తంలోనే గాకుండా, కండరాలలో కూడా నీటిశాతం తగ్గిపోయి.. తద్వారా రక్తంలో ఉండాల్సినంత నీరు లేకపోవడంతో చిక్కగా మారుతుంది.
దీంతో... వివిధ కణాలు ఒకదానితో మరొకటి చేరి ఎక్కడికక్కడ చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడతాయి. ఇలాంటి గడ్డలతో కూడిన రక్తాన్ని గుండె తన ద్వారా పంపించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి స్థితిలో గుండె పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
ఇదిలా ఉంటే... మనుషుల్లో వాంతులు, నీళ్ల విరేచనాలు లాంటి జబ్బులు వచ్చినప్పుడు శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంటుంది. అందుకే అలాంటి సమయాల్లో నీరు, పళ్ల రసాలు, లేదా ఉప్పు-చక్కెర కలిపిన ద్రావణం లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.
ఎందుకంటే... అలా చేయడం వలన శరీరానికి అవసరమైన నీటిని, లవణాలను ఎప్పటికప్పుడు అందిస్తూ, పరిస్థితి విషమించకుండా కాపాడుకోవచ్చు. కేవలం అలాంటి పరిస్థితుల్లోనేగాక, మామూలుగా ఉన్నప్పుడు కూడా మనం ప్రతిరోజూ శరీరానికి అవసరమైనంత నీటిని తాగుతూ ఉండాలి. వేసవి కాలంలో అయితే, మరింత ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది.
అర్థమైంది కదూ పిల్లలూ...! ఇప్పుడు వేసవి కాలం కాబట్టి.. పైన చెప్పుకున్నట్లుగా, మామూలుగా తాగే మోతాదుకంటే ఎక్కువ నీటిని తప్పకుండా తాగుతారు కదూ...!!