సైన్స్ పితామహుడు "ఐజాక్ న్యూటన్"

FILE
మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన "సర్ ఐజాక్ న్యూటన్" ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను "సైన్సు పితామహుడు"గా కీర్తించింది. అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన ఈ మహనీయుడి జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకునే ఓ చిన్న ప్రయత్నం.

జనవరి 4, 1643వ సంవత్సరంలో నెలలు నిండకుండానే జన్మించాడు ఓ చిన్నారి. ఆ చిన్నారే పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ ముద్దులొలికే చిన్నారే సర్ ఐజాక్ న్యూటన్. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలం జన్మించాడు. తను పుట్టడానికి మూడు నెలల ముందుగానే తండ్రి చనిపోగా, తనకు మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో న్యూటన్ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్దనే పెరిగి పెద్దయ్యాడు.

న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారంలాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ "ప్రిన్సిపియా మేథమేటికా" అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా "దృశాశాస్త్రం" పుట్టింది.

ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం "సర్‌" అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్ కాస్తా సర్ ఐజాక్ న్యూటన్‌గా మారిపోయారు. ఆ తరువాత కూడా ఎన్నో మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 20, 1727లో తనకెంతో ఇష్టమైన విశ్వంలోకి ఆనందంగా పరుగులు పెడుతూ వెళ్లిపోయారు.

వెబ్దునియా పై చదవండి